పరిపాలన రాజధానిగా విశాఖ అవ్వడం ఫిక్స్ అయిపోయిందని, దానిని ఎవ్వరూ మార్చలేరని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తేల్చి చెప్పారు. విశాఖ పరిపాలనా రాజధానిగా రాష్ట్రానికి ఎంతో సంపదను తెచ్చి పెడుతుందని, 29 గ్రామాలున్న అమరావతి ఎక్కడ? 29 నియోజకవర్గాలున్న నగరాలెక్కడ? అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో జగన్ సర్కార్ పై అనవసరంగా బురదజల్లుతున్నారని ఫైర్ అయ్యారు. మూడు రాజధానులతోనే ఏపీ డెవలప్ అవుతుందని అన్నారు. మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి వుందని, అమరావతి, కర్నూలు, విశాఖ అన్నీ సమానమేనని తేల్చి చెప్పారు. 2024 లోపే మూడు రాజధానులపై బిల్లు పెడతామని, పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు వుండి తీరుతాయని నొక్కి వక్కాణించారు.
అమరావతి ని మోసం చేస్తున్న చంద్రబాబు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. పిట్టల దొరలా మారి, ప్రజలను, అమరావతి రైతులను కూడా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కట్టలేని రాజధానిని గ్రాఫిక్స్ లో చూపించి, మోసం చేవారి దుయ్యబట్టారు. ఒక అసెంబ్లీలో 6 మండలాలుంటే ఒక మండలంలోని 29 గ్రామాలతో వున్న అమరావతిని ఢిల్లీతో పోల్చుతూ మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు.