బ్రిటన్ ఎలిజిబెత్ పరిపూర్ణ జీవితం గడిపారని బ్రిటన్ నూతన రాజు, ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్ 3 ప్రకటించారు. తన తల్లి జీవితం మొత్తం దేశం కోసమే బతికారని, ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. రాణి ఎలిజిబెత్ మరణించిన నేపథ్యంలో రాజు హోదాలో తొలిసారి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన తల్లి మరణం దేశాన్ని తీరని శోకంలోకి నెట్టేసిందని, ఆమె ఆప్యాయత, అభిమానం దేశానికి మార్గదర్శకమని కొనియాడారు. తన జీవితాన్ని దేశానికే అంకితం చేస్తానని యుక్త వయస్సులో ప్రకటించారని, ప్రకటించిన ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆ వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తనపై పడిందని, దానిని నెరవేరుస్తానని కింగ్ ఛార్లెస్ తెలిపారు.
ఎలిజబెత్ 2కు ప్రిన్స్ ఫిలిఫ్ లాగా రాచరిక అంత్యక్రియలు కాకుండా బ్రిటన్ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించనుంది. సైనిక ఊరేగింపులో నేవికి చెందిన నావికులు గన్‌క్యారేజీపై ఎలిజబెత్ మృతదేహాన్ని తీసుకువెళ్లడంతో అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ప్రజలు సందర్శనార్ధం రాష్ట్రభవనంలో ఆమె భౌతికదేహాన్ని ఉంచుతారు. అంత్యక్రియలకు దాదాపు నాలుగు రోజులు ముందు వరకు ఆమె భౌతిక దేహం వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో ఉంటుంది. తర్వాత దేశాధినేతలకు 21 తుపాకుల గౌరవ వందనం ఇస్తారు.