గత ప్రభుత్వాలు పూజనీయ స్థలాలను నిర్లక్ష్యం చేశాయి.. ప్రధాని మోదీ

గత ప్రభుత్వాలు మహిమాన్విత పూజనీయ స్థలాల వైభవాన్ని మరిచిపోయాయని, తమ ప్రభుత్వం ఒక్కొక్క పూజనీయ స్థలాలను పునరుద్ధిరిస్తూ వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాశీ విశ్వనాథాలయం, అయోధ్య, ఉజ్జయినీ ఆలయాల్లో భారీ ఎత్తున చేపట్టిన పునర్నిర్మాణ పనులే ఇందుకు నిదర్శనం అన్నారు. కానీ డెవలప్ మెంట్ కార్యక్రమాలను కూడా నేరంగానే కొందరు చూస్తున్నారని, నేరంగానే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారిలో బానిసత్వపు మనస్తత్వం వుండిపోయిందంటూ మోదీ విరుచుకుపడ్డారు.

 

ప్రధాని మోదీ శుక్రవారం బదరీ, కేదార్ నాథ్ పుణ్య క్షేత్రాలను సందర్శించారు. గౌరీకుండ్-కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ. 3,400 కోట్ల వ్యయంతో 9.7 కిలోమీటర్ల పొడవున ఈ రోప్‌వేను నిర్మించారు. గౌరీ కుండ్ నుంచి కేదార్ నాథ్ , గోవింద్ ఘాట్ నుంచి హేమకుండ్ సాహిబ్ లను కలుపుతూ రెండు కొత్త రోప్ వే ప్రాజెక్టులు వచ్చాయి. దీంతోపాటు కేదార్‌నాథ్, బదరీనాథ్ ధామ్‌లలో అనేక కనెక్టివిటీ ప్రాజెక్టులను నిర్మిస్తారు. ఎన్‌హెచ్-7 రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. హృషీకేశ్, జోషీమఠ్, బదరీనాథ్‌లను డెహ్రాడూన్, చండీగఢ్, ఎన్‌హెచ్-107లను ఈ ప్రాజెక్టులు కలుపుతాయి.

 

మత ప్రాముఖ్యమున్న దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను గాయపరచడమే అని అన్నారు. నిజానికి భారతీయుల వారసత్వం ఎంతో గొప్పదని, వాటి పునరుద్ధరణకు చేసే ప్రయత్నాలు 21 వ శతాబ్దపు నయా భారత్ కు పునాది వంటివని అభివర్ణించారు. మన దేవాలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు మాత్రమే కావని, వేలాది ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న ఘనమైన వారసత్వానికి ప్రతీకలని తెలిపారు. కేదార్ నాథ్ కు గతంలో ఏటా మహా అయితే 5 లక్షల మంది వచ్చేవారని, ఈ యేడాది.. ఏకంగా 45 లక్షల మంది దర్శించుకున్నారని మోదీ వివరించారు.

Related Posts

Latest News Updates