మధ్యప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం… 15 మంది దుర్మరణం.. 40 మందికి గాయాలు

మధ్య ప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సుమారు 40 మంది గాయపడినట్లు సమాచారం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ కి వెళ్తోంది. మధ్య ప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌ కి 530 కిలోమీటర్ల దూరంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది.పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. దీపావళి పండుగ సందర్భంగా వారంతా తమ స్వస్థలాలకు వెళ్తున్నారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

 

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కు తెలియజేసినట్లు తెలిపారు. ప్రమాద బాధితులకు సహాయ కార్యకలాపాలు చురుగ్గా, పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లు తెలిపారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ విషాదకర సమయంలో సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు.

 

ఇదిలావుండగా, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. అదేవిధంగా గాయపడినవారికి రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఈ ప్రమాద బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related Posts

Latest News Updates