తనను ప్యాకేజీ స్టార్ అని ఎవరైనా అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేయగా… ఈ వ్యాఖ్యలకు అధికార వైసీపీ తీవ్రంగా విడుచుకుపడుతూ కౌంటర్ ఇచ్చింది. మా దగ్గర చెప్పులు లేవా? అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఫస్ట్రేషన్ ఎక్కువై, పవన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడం, పళ్లు రాలగొట్టడం అంటే… పవన్ కు భీమవరంలో, గాజువాకలో జరగడం లాంటిదన్నారు. మొన్న ఎన్నికల్లో కేవలం 6 శాతం ఓట్లు వచ్చిన పవన్ దగ్గర చెప్పులుంటే… 50 శాతం ఓట్లు వచ్చిన తమ దగ్గర ఎన్ని వుండాలని సూటిగా ప్రశ్నించారు. మూడు పెళ్లిళ్లే పవన్ విధానమని, ఇన్ని రోజులు పవన్ పులి అనుకున్నామని, కానీ పిచ్చికుక్క అని తేలిందని అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక.. మరో మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ అసలైన రూపం నేడు బయటపడిందన్నారు. ఎప్పటి నుంచో ప్యాకేజీ స్టార్ అని అంటున్నామని, ఇప్పటికీ అదే అంటామని అన్నారు. ఒకసారి కాదు.. వంద సార్లు అంటామని అంబటి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఎటు చీల్చనివ్వనని పవన్ అన్నారని, బాబు నుంచి ప్యాకేజీ తీసుకున్న తర్వాతే.. ఈ మాటలు అన్నారని అంబటి విమర్శించారు. పవన్ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదని తేలిపోయిందని అంబటి ఎద్దేవా చేశారు.