మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రూ.856 కోట్ల వ్యయంతో చేపట్టిన ‘మహాకాల్ లోక్ కారిడార్’ను ఆయన మంగళవారం జాతికి అంకితమిచ్చారు. వేదికపై నుంచి శివలింగం ప్రతిరూపాన్ని రిమోట్ కంట్రోల్ బటన్ నొక్కి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంప్రదాయం వస్త్ర ధారణలో ప్రధాని మోదీ గర్భ గుడిలో 20 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనంతరం గవర్నర్ మంగూబాయ్, సీఎం శివరాజ్ తో కలిసి బ్యాటరీ కారులో ప్రయాణిస్తూ మోదీ కారిడార్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఎం శివరాజ్ ప్రధానికి మొత్తం కారిడార్ స్వరూపాన్ని వివరించారు. ఆ తర్వాత కార్తిక్ మేళా మైదానంలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. భారతదేశ అభ్యుదయం, విజ్ఞానానికి ఉజ్జయిని వేలాది సంవత్సరాలుగా నాయకత్వం వహించిందని పేర్కొన్నారు. హాకాల్ ప్రాజెక్టుతో ఉజ్జయినికి శోభ చేకూరనుందన్నారు. ఇక్కడి ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత నిండి ఉందని, నలుదిశలా దైవశక్తి ప్రసారమవుతోందన్నారు. మొదటిసారిగా చార్ధామ్లను ఆల్-వెదర్ రహదారులతో అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. ఉజ్జయినిలోని ప్రతి మూలలో దైవిక శక్తి ప్రసారం అవుతుందన్నారు. భారత శ్రేయస్సు, గౌరవం, సాహిత్యానికి వేలాది సంవత్సరాలుగా ఉజ్జయిని సారథ్యం వహిస్తూ వస్తోందన్నారు.
పునరుద్ధరణతో నవ కల్పన చేకూరుతుందని, వలస పాలనలో కోల్పోయిన వాటిని దేశం పునర్నిర్మిస్తోందని మోదీ వివరించారు. గత కీర్తిని పునరుద్ధరించుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. కారిడార్ లో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్ లు ఈ ప్రాంతానికి మరింత శోభనిచ్చాయి. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అక్కడ ఏర్పాటు చేసిన దేవతా మూర్తుల ప్రతిమలు, సప్త రుషుల శిల్పాలు, 190 రూపాల్లో శివుడి ప్రతిమలు కొత్త సొబగులను అబ్బాయి. శేష అలంకరణలతో 108 ఇసుక స్తంభాలు, వాటిపై శివ ముద్రలతో కూడిన త్రిశూల చిహ్నాలు, 111 అడుగుల పొడవైన భారీ శివ వివాహ కుడ్య చిత్రం, ఆనంద తాండవ స్వరూప చిత్రం, 200కు పైగా శివ, శక్తుల విగ్రహాలు, ఆకర్షణీయమైన ఫౌంటేన్లు, శివ పురాణంలోని కథలను వర్ణించే 50కంటే ఎక్కువ కుడ్య చిత్రాలు..ఇలా కొత్త అందాలను చేకూరుస్తున్నాయి.