కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను క‌ట్టెబ‌ట్టిన మాదిరిగానే.. మా న‌ల్ల‌గొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వండి.. పోటీ నుంచి త‌ప్పుకుంటామ‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ విష‌యంలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి నిన్న చేసిన మాట‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా క‌ట్టుబ‌డి ఉంటాన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు.

 

మునుగోడు ఉప ఎన్నిక కేవ‌లం ఒక్క కార‌ణంతోనే వ‌చ్చిందని, ఒక కాంట్రాక్ట‌ర్ బ‌లుపు కార‌ణంగానే వ‌చ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి, ఆయ‌న‌ను లోబ‌ర్చుకున్నారని బీజేపీపై మండిపడ్డారు. అవ‌స‌ర‌మైతే రూ. 500 కోట్లు ఖ‌ర్చు పెట్టి అయినా స‌రే, మునుగోడు ప్ర‌జ‌లను అంగ‌డి స‌రుకులా కొంటాన‌ని న‌రేంద్ర మోదీ అహ‌కారం ప్ర‌ద‌ర్శిస్తున్నారని విమర్శించారు. ఆ అహంకారానికి, మునుగోడు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నిక‌నే మునుగోడు ఉప ఎన్నిక అని కేటీఆర్ అభివర్ణించారు.

 

తెలంగాణ ఉద్య‌మంలో యూనివ‌ర్సిటీ విద్యార్థులు వీరోచిత పోరాటం చేశార‌ని కేటీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. విద్యార్థులంతా వీరోచిత పోరాటం చేసిన స‌మ‌యంలో ఇప్పుడు టీ బీజేపీ, టీ కాంగ్రెస్ పేరిట ప‌ద‌వులు అనుభ‌విస్తున్న వారు ఎక్కడా క‌న‌బ‌డ‌లేద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ లేక‌పోతే టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్ లేక‌పోతే ఈ ద‌ఫా తెలంగాణ ఉద్య‌మం లేదని పేర్కొన్నారు. ఉద్య‌మంలో మీరంతా లేక‌పోతే తెలంగాణ వ‌చ్చుడే లేదు. ఈ తెలంగాణ రాక‌పోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్ ఉండేవి కావు. మీరు పెట్టిన భిక్ష‌నే ఆ ప‌ద‌వులు అని కేటీఆర్ పేర్కొన్నారు.