భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అమెరికా, బ్రిటన్ వెళ్లేవారికి తీపి కబురు చెప్పింది. యూకేలోని రెండు నగరాలు, యూఎస్లో ఒక నగరానికి కలిపి వారానికి అదనంగా 20 విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్లోని బర్మింగ్హామ్ నగరంతో పాటు రాజధాని లండన్కు అదనంగా విమాన సర్వీసులు నడపనుంది. అగ్రరాజ్యంలోని శాన్ ఫ్రాన్సిస్కోకు నగరానికి కూడా నడపాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఈ మూడు గమ్యస్థానాలకు ప్రయాణికుల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ మూడు గమ్యస్థానాలకు అదనపు విమానాలను అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు దశలవారీగా ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టనుంది. ఈ మూడు నగరాలకు కలిపి వారానికి అదనంగా 20 విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించింది. వీటిలో బర్మింగ్హామ్కు ఐదు, లండన్ కు తొమ్మిది, శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి ఆరు అదనపు విమానాలు నడపనుంది. తద్వారా వారానికి అదనంగా 5వేల సీట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది. ప్రస్తుతం బ్రిటన్కు ప్రతి వారం 34 విమానాలు నడుపుతున్న ఎయిర్ ఇండియా తాజాగా అదనంగా 14 విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించడంతో ఈ సంఖ్య 48కి చేరుకుంటుంది. అమెరికా కు ప్రస్తుతం వీక్లీ 34 విమాన సర్వీసులు ఉండగా.. తాజాగా ప్రకటించిన ఆరు అదనపు విమానాలతో కలిసి ఈ సంఖ్య 40 అవుతుంది.