కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ దాఖలు చేసే ఒక రోజు ముందు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ- గాంధీ కుటుంబం లేకుంటే కాంగ్రెస్ కు బతుకే లేదన్నారు. ఆ కుటుంబం లేకుంటే పార్టీ శూన్యమేనని తెలిపారు. కాంగ్రెస్ లో చాలా సార్లు అభిప్రాయ భేదాలు వచ్చాయని, అయినా… దేశం కోసం త్యాగం చేసిన కుటుంబానికే 99 శాతం మంది నేతలు మద్దతిచ్చారని గుర్తు చేశారు. అయితే.. రాజస్థాన్ లో ఏర్పడిన సంక్షోభం అత్యంత దురదృష్టకరమని అన్నారు. గెహ్లాట్ గనక పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే పార్టీ కచ్చితంగా మద్దతిచ్చేదని అన్నారు.
మరోవైపు తాను పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని దిగ్విజయ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఎన్నికల అధికారి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఇవే నామినేషన్ పత్రాలు అంటూ మీడియాకు కూడా చూపించారు. రేపు నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మరో నేత శశి థరూర్ కూడా పోటీలో నిలుస్తున్నారు. అయితే.. తమ మధ్య స్నేహపూర్వక పోటీయే వుంటుందని స్పష్టం చేశారు.