ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇస్తున్న ఉచిత రేషన్ ను మరో 3 నెలలకు పొడగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని పెంచారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. నిజానికి.. సెప్టెంబర్ 30 తో ఉచిత రేషన్ గడువు ముగుస్తుంది. కానీ… మరో 3 నెలలు పొడగించాలని నిర్ణయించారు. దీంతో డిసెంబర్ 31 వరకూ ఈ ఉచిత రేషన్ పథకం కొనసాగుతుంది. దీంతో కేంద్ర ఖజానాపై 44,700 కోట్ల మేర అదనపు భారం పడుతుంది.
కరోనా మహమ్మారి కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించింది. దీంతో చాలా మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏప్రిల్ 2020 లో ఉచిత రేషన్ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే.. కరోనా వుండటంతో ఈ పథకాన్ని కేంద్రం పొడిగిస్తూ వచ్చింది. తాజాగా… పండగ సీజన్ నేపథ్యంలో మరోసారి పొడిగించింది. దాదాపు 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల చొప్పున ప్రతి నెలా ఉచిత రేషన్ అందుతోంది.