ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సభా మర్యాదను కాపాడతానని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సభా మర్యాదను తాను కాపాడతానని ప్రకటించారు. సభ్యులందరూ కూడా సభా మర్యాదను కాపాడాలని కోరారు. ఎందుకంటే టీవీల ద్వారా ప్రజలు సమావేశాలను చూస్తూనే వుంటారని, అందుకే హుందాగా వ్యవహరించాలని సూచించారు. సభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సభలో రాజకీయాలు వుండవని, సభ బయట మాట ఓ నేతగానే వ్యవహారం వుంటుందని స్పష్టం చేశారు.
కోలగట్ల రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. నిరంతరం ప్రజల్లో వుండే వ్యక్తి వీరభద్ర స్వామి అని సభ్యులు కొనియాడారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల ఎన్నిక కాగానే… సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని, అచ్చెన్నాయుడు, మంత్రి బొత్స ఆయనను స్పీకర్ స్థానం వరకూ తీసుకొని వెళ్లి, ఆయన్ను అందులో కూర్చోబెట్టారు.