స్వలింగ వివాహాలపై కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరమైన అనుమతిని మంజూరు చేయడాన్ని కేంద్రం వ్యతిరేకించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం తన స్పందనను తెలియజేసింది. స్వలింగ వివాహాలను ప్రస్తుతం వున్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణించాలనేది ప్రతి పౌరుడి ప్రయోజనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కేంద్రం తెలిపింది. స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లు కేవలం పట్టణ ప్రాంతాల్లో వుండే ఉన్నత వర్గాల అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయని, పిటిషనర్లు దేశ ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేవాళ్లు కాదని కేంద్రం తన వాదనల్లో స్పష్టం చేసింది.
భారత సమాజంలో వివాహ వ్యవస్థ అనేది ప్రస్తుతానికి చట్టపరమైన గుర్తింపుతో కొనసాగుతున్న ఓ భిన్నమైన సంస్థ అని కూడా పేర్కొంది కేంద్రం. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులతో వుండే పార్లమెంట్ కే వదిలేయాలని సుప్రీంను కోరింది. వివాహాలను గుర్తించడం పూర్తిగా చట్టపరమైన అంశమని, దీనికి కోర్టులు దూరంగా వుండాలని కోరింది. వివాహ చట్టబద్ధత అనేది ఓ సామాజిక చట్టపరమైన వ్యస్థ అని, రాజ్యాంగం ప్రకారం దీన్ని చట్టసభలు సృష్టించాయని, దాని ప్రకారమే వివాహానికి చట్టబద్ధత రావాలని కేంద్రం పేర్కొంది. వివాహాలకు చట్టబద్ధతనిచ్చే అంశంలో పార్లమెంట్ అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. కొత్త బంధాన్ని గుర్తించడం, వాటికి చట్టబద్ధత కల్పించడం అనే అంశాలను కూడా చట్టసభ్యులే నిర్ణయించాలని కేంద్రం తేల్చి చెప్పింది. ఇది ఎంత మాత్రమూ న్యాయవ్యవస్థ పరిధిలోనిది కాదని తెలిపింది.