సమాజానికి ఉపయోగపడే చిత్రాలే చేస్తాను.. ‘సింబా’ నిర్మాత రాజేందర్ రెడ్డి

అనసూయ, జగపతిబాబు జంటగా నటించిన చిత్రం ‘సింబ’. సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కథను సంపత్ నంది అందించగా మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్ట్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత రాజేందర్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పినది ప్రత్యేకం.

* కేవలం కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా మాత్రమే కాకుండా అన్ని రకాల అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. కరోనా టైంలో సంపత్ నంది గారు నాకు ఈ కథను చెప్పారు. సమాజానికి ఉపయోగపడేలా ఓ సినిమాను చేయాలని అనుకున్నాను. ఈ కథ బాగా నచ్చడంతో సింబాను ప్రారంభించాను. అంతకు ముందు కూడా చాలా కథలు వినిపించారు. కానీ సింబాను తీయాలని అనిపించింది.

* సింబా అంటే అడివికి రాజు సింహం. పైగా అమ్మవారి వాహనం. ఇందులో అడివిని కాపాడే వ్యక్తిగా కనిపిస్తాడు. అందుకే సింబా అనే పవర్ ఫుల్ టైటిల్‌ను పెట్టాం.

* మురళీ మనోహర్ గారు సంపత్ నంది వద్ద ఎన్నో చిత్రాలకు పని చేశారు. ఆయన లండన్‌లో ఫిల్మ్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. మురళీ మనోహర్ మీద సంపత్ నంది గారెకి నమ్మకం ఉంది. ఆ ఇద్దరూ ఒక్కరే అని నా అభిప్రాయం. ఆయన్ను నేను కూడా నమ్మాను. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఆయనకు ఇచ్చాం.

* కరోనా కంటే ముందు కథను అనుకున్నాం. కరోనా వల్ల షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ఆ తరువాత మెల్లిగా షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. కరోనా మాకు కలిసి వచ్చిందనే చెప్పొచ్చు.

* జగపతి బాబు గారితో నాకు 25 ఏళ్ల నుంచి బంధం ఉంది. జగపతి బాబు ఇంట్లో పచ్చదనమే కనిపిస్తుంది. ఈ కథకు ఆయన ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఎంతో డెడికేటెడ్‌గా పని చేశారు.

* ప్రస్తుతం మనం ఎలాంటి కాలుష్య వాతావరణంలో ఉన్నామో చెప్పాల్సిన పని లేదు. ప్రకృతి మీద అవగాహన, పర్యావరణ పరిరక్షణ అవసరం ఎంత ఉంది? అని ఇందులో చెప్పాం. కమర్షియల్ అంశాలను మేళవించి ఈ కథను చెప్పాం.

* సంపత్ నంది గారు ఇంత వరకు కమర్షియల్ కాన్సెప్ట్‌లు రాశారు. కానీ ఈ మూవీని సైఫై థ్రిల్లర్‌గా రాశారు. ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. ట్రైలర్ చూస్తే ఎవరి కారెక్టర్ ఏంటో కూడా అర్థం కాకుండా ఉంటుంది. సెన్సార్ వాళ్లు చూసి కూడా అభినందించారు. సినిమాకు అవార్డులు కూడా వస్తాయని అన్నారు.

* సామాజిక దృక్పథంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. 25 ఏళ్ల క్రితం మీడియాలో పని చేశాను. సమాజ శ్రేయస్సు కోసం, సమాజానికి ఉపయోగపడే చిత్రాలే చేస్తాను. జనాలకు ఏదో ఒక మంచి చెప్పాలనే చేస్తాను.

* కథ విన్నాక నాకు సంతృప్తి కలిగింది కాబట్టే సింబాను నిర్మించాను. సినిమా చూసి కొంత మందిలో ఆలోచన కలిగినా నాకు చాలు. అదే నాకు సక్సెస్. అలా నేను పూర్తిగా సంతృప్తి చెందితేనే సినిమాలు చేస్తాను.

* రెండు వందల థియేటర్లలో సింబాను రిలీజ్ చేస్తున్నాం. ప్రతీ వారం సినిమాలు వస్తూనే ఉంటాయి. ఆగస్ట్ 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం కాబట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాను. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. మొక్కలు నాటడం, అటవీ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం.

* గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. మా టీజర్ చూసి సంతోష్ కుమార్ టీం మమ్మల్ని పిలిచింది. ఆ టైంలో వారి ప్రభుత్వం మాకు సహకరించింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తోంది.

* కొన్ని కథలు విన్నాను. సింబా విడుదలయ్యాక.. కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తాను.

Related Posts

Latest News Updates