ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ మళ్లీ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపింది. తమ సమస్యలను సంక్రాంతి పండగ లోపు పరిష్కరించక పోతే… ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వేంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైబీ రావు హెచ్చరించారు. రావాల్సిన బకాయిలు అడుగుతామనే సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఆందోళనలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. తమకు రావాల్సిన జీతభత్యాల చెల్లింపు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై సీఎం జగన్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, సమస్యలను తెలుసుకోవాలన్నారు. మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిందని, ఇప్పుడు విస్మరించారని విమర్శించారు. ఉద్యోగులకు బకాయిలను ఏప్రిల్ 30 లోపు చెల్లిస్తామని జనవరిలో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో చెప్పారని, కానీ… ఎన్ని సార్లు సమావేశాలు నిర్వహిస్తున్నారని బొప్పరాజు వేంకటేశ్వర్లు ప్రశ్నించారు.












