ఓ వైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో దీక్ష చేస్తుండగా… ఆ పార్టీకే చెందిన మహిళా ప్రతినిధి… ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై సంచలన ఆరోపణలకు దిగారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి, అసభ్యంగా మాట్లాడుతున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని స్టేషన్ ఘనపూర్ లోని జానకీపురం మహిళా సర్పంచ్ కుర్సపెల్లి నవ్య పేర్కొన్నారు. తమ పార్టీలోని కొందరు మహిళా ప్రజా ప్రతినిధులే ఎమ్మెల్యే రాజయ్య కోరి తీర్చాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు.

 

వారి మాట వినలేదని గ్రామాభివ్రుద్ధి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని పేర్కొన్నారు. తాను నేతల కోరికలు తీర్చేందుకు రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని, తన వద్ద అన్ని ఆధారాలూ వున్నాయని తెలిపారు. కాల్ రికార్డ్స్ కూడా వున్నాయన్నారు. ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే… రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు.