ముగిసిన తారకరత్న అంత్యక్రియలు… తారకరత్న చితికి నిప్పు పెట్టిన మోహనకృష్ణ

తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని మహా ప్రస్థానానికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి మోహన్‌కృష్ణ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. తారకరత్న చితికి మోహనకృష్ణ నిప్పుపెట్టారు. చివరిసారి తారకరత్న నుదిటిపై తండ్రి మోహనకృష్ణ ముద్దుపెట్టి కన్నీరుమున్నీరయ్యారు. కాగా తారకరత్న పాడెను చిన్నాన్న రామకృష్ణ, బాలకృష్ణ, ఇతర బంధువులు మోశారు. భారమైన హృదయాలతో తారకరత్నను చంద్రబాబు, ఎంపీ విజయసాయి, బాలకృష్ణ, టీడీపీ నేత అచ్చెన్నాయుడు, కుటుంబసభ్యులు, అభిమానులు సాగనంపారు. అంత్యక్రియల్లో నందమూరి కుటుంబసభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పాల్గొన్నారు.

తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన.. అక్కడ గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జనం మధ్యనే ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్‌ చానల్‌ ద్వారా ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. కాగా.. శివరాత్రి రోజున తారకరత్న తుదిశ్వాస విడిచారు.

Related Posts

Latest News Updates