మన దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలు బయటపడ్డాయి. జమ్మూ కశ్మీర్ లో 59 లక్షల టన్నుల లిథియం వుందన్న విషయాన్ని కేంద్ర గనుల శాఖ గుర్తించింది. ఈ విషయాన్ని ప్రకటించింది. లిథియాన్ని ఎక్కువగా బ్యాటరీలు, విద్యుత్ పరికరాల తయారీలోనే వాడతారు. బ్యాటరీలు, విద్యుత్ పరికరాల తయారీలో కీలకమైన ఈ లోహాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్ము కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో కనుగొన్నట్లు గనుల శాఖ ట్వీట్ చేసింది. గనుల శాఖ నిర్వహించిన సర్వేలో జమ్మూకాశ్మీర్, ఏపీ, చత్తీస్ ఘడ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణల్లో 51 చోట్ల ఖనిజ నిల్వలను గుర్తించారు.
వాటిలో 5 బంగారం గనులు కాగా.. మిగిలిన చోట పొటాష్, మాలిబ్డినం తదితర లోహాలను గుర్తించారు. దేశ వ్యాప్తంగా ఇలా 51 ఖనిజ క్షేత్రాలను గుర్తించారు. వాటిని గనుల శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించింది. వీటిలో 17 చోట్ల 7,897 మిలియన్ టన్నుల బొగ్గు, లిగ్నైట్ వున్న గనులను బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించారు.
ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో ఉపయోగించే లిథియంను భారత్ ముఖ్యంగా ఆస్ట్రేలియా, అర్జెంటీనా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తాజాగా లిథియం నిల్వలు కనుగొనడంతో ఈవీ వాహనాల తయారీకి మరింత బలం చేకూరనుంది. కొత్తగా బయటపడిన నిల్వల కారణంగా దేశంలో లిథియం దిగుమతులు తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా ప్రజలు కూడా బాగానే స్పందిస్తున్నారు. అంతేకాకుండా ఈవీ ధరలు తక్కువగా వుండడానికి పలు పన్ను ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. లిథియం నిల్వలు బయటపడటంతో భవిష్యత్తులో విద్యుత్ వాహన తయారీరంగానికి మరింత బలం వచ్చినట్లైంది.