భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ వగీర్..నౌకాదళ సామర్థ్యాలు పెరుగుతాయని నేవీ ప్రకటన

దేశీయంగా నిర్మించిన సబ్ మెరైన్ ”ఐఎన్ఎస్ వగీర్” భారత నౌకాదళంలోకి చేరింది. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ సమక్షంలో ఈ సబ్ మెరైన్ ను అధికారులు నౌకాదళానికి అప్పగించారు. ఈ సబ్ మెరైన్ తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయని హరికుమార్ ప్రకటించారు. దేశ ప్రయోజనాలను శత్రువుల నుంచి కాపాడుతుందని, సంక్షోభ సమయంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్, నిఘా, పర్యవేక్షణలను అందిస్తుందని వివరించారు.

ఐఎన్‌ఎస్‌ వగీర్‌ను 2020 నవంబర్‌లోనే ఆవిష్కరించగా.. అప్పటి నుంచి ఫిబ్రవరి 2022 వరకు సముద్రంలో ఆయుధాలు, సోనార్లు సహా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ సబ్‌మెరైన్‌ని నౌకాదళానికి అప్పగించారు. గతంలో భారత్‌ నిర్మించిన సబ్‌మెరైన్‌లన్నింటిలో వగీర్‌నే అత్యంత వేగంగా నిర్మించారు.

ఐఎన్‌ఎస్ వగీర్‌ అనేది కల్వరి క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్.ఐఎన్‌ఎస్ వగీర్‌ పొడవు 221 అడుగులు మరియు వెడల్పు 40 అడుగులు వుంటుంది. ఇది నాలుగు శక్తివంతమైన డీజిల్ ఇంజన్లతో పనిచేస్తుంది.ఇది సముద్రంలో గంటకు 37 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది సముద్ర ఉపరితలంపై గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళుతుంది.ఇది ఎలాంటి సమస్య లేకుండా 350 అడుగుల లోతు వరకు వెళ్లగలదు.

ఇది సముద్ర ఉపరితలంపై ఒకేసారి 12,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు.అలాగే సముద్రం లోపలికి వగిర్ ఒక్కసారిగా వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. దీంతో పాటుగా ఈ జలాంతర్గామి 50 రోజుల పాటు ఎప్పుడూ నీటిలోనే వుండగలదు. ఇందులో నావిగేషన్, ట్రాకింగ్ సిస్టమ్ తో అమర్చబడి వుంటుంది. ఇందులో 40 మంది కంటే ఎక్కువ మంది సైనికాధికారులు వుండొచ్చు.

Related Posts

Latest News Updates