తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలకు దిగారు. మంత్రి నిరంజన్ రెడ్డి కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి 165 ఎకరాల్లో ఫార్మ్ హౌజ్ నిర్మించుకున్నారని ఆరోపించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనే కాంపౌండ్ వాల్ నిర్మించారని.. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో సీసీ రోడ్లు సైతం నిర్మించుకున్నారని రఘునందన్ రావు తెలిపారు. అంతేకాకుండా మంత్రి నిరంజన్ రెడ్డి ఫార్మ్ హౌజ్ నిర్మించుకున్న మానోపాడు మండలంలో తహశీల్దార్ కార్యాలయం తగలబడటం వెనుక మంత్రి నిరంజన్ రెడ్డి ప్రమేయం ఉందన్నారు.

మానోపాడు మండలం తహశీల్ధార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి కబ్జా చేసిన స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మాయం చేసేందుకు జరిగిన అగ్ని ప్రమాదంగా రఘునందన్ రావు అభివర్ణించారు. తహశీల్ధార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది అని తహశీల్ధార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. మానోపాడు పోలీసులు కనీసం చార్జిషీట్ కూడా వేయలేదు అని తెలిపారు. ప్రాజెక్టులకు కేటాయించిన భూములను ఆక్రమించి వ్యవసాయ శాఖ మంత్రి 3 ఫాంహౌజ్ లు కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. వీటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలన్నారు.

అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు కట్టిండని ఈటలను మంత్రి పదవి నుంచి తీసేసిన్రు..అంతకు ముందు ఓ ఎస్సీ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించారు.. ఎస్సీ, బీసీలకు ఒక న్యాయం,అగ్రనాయకులకు ఒక న్యాయమా? కేసీఆర్ అంటూ ప్రశ్నించారు.ప్రాజెక్టులకు కేటాయించిన భూములను కబ్జా చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక సెంటు భూమి కూడా కబ్జా చేయలేదని వెంకటేశ్వరస్వామి గుడిలో వ్యవసాయశాఖ మంత్రి ప్రమాణం చేయాలని సవాల్ రఘునందన్ రావు సవాల్ విసిరారు.

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి

మా స్వగ్రామం పానగల్‌లో నాకు ఉన్న భూముల వివరాలన్నీ 2014, 2018 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నవేనని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో తన సతీమణి సొంత డబ్బులు, బ్యాంకు లోనుతో నిర్మించుకున్న ఇల్లు అని తెలిపారు. విదేశాల్లో చదువుకుని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మేజర్లు అయిన మా ఇద్దరు అమ్మాయిలు స్వార్జితంతో చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుండి, ఇతరుల నుండి చట్టబద్దంగా భూములు ఖరీదు చేమని వెల్లడించారు. ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారు అని రఘునందన్ రావు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.

తల్లితండ్రులను కోల్పోయిన గౌడ నాయక్‌ అనే పసిబాలుడిని నేనే చేరదీసి ఇంట్లో పెట్టుకుని, పెంచి పెద్దచేసి, ఉన్నత చదువులు చదివించిన విషయం వనపర్తి నియోజకవర్గం అంతా తెలుసని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తమ కుటుంబంలో ఒకడిగా ఉంటాడని తెలిపారు. ప్రస్తుతం తమ ఇంటి వ్యవహారాలు చూసుకునేది కూడా అతడేనని చెప్పారు. ఆ భూములు కొన్న వారితో అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితులలో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్ట్రేషన్ చేసి.. ఆ తర్వాత పిల్లల పేరు మీదకు మార్చుకోవడం జరిగిందని తెలిపారు. ఒక్క గుంట భూమి ఎక్కువ వున్నా… రాజీనామా చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు.