ప్లాట్‌ ఎందుకు? ఫ్లాట్‌లో నేరుగా గృహప్రవేశమే!
లడ్డూ కావాలా నాయనా!!

ఇది పదిహేనేళ్ల కిందటి మాట. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వడం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్న రోజులవి. కొత్తగా ‘జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స మ్యూచ్యువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ’ ఏర్పడింది. ఐదేళ్లు నిండిన జర్నలిస్టులకు (కెరీర్‌లు మధ్య విరామాలు లేకుండా, ప్రధాన స్రవంతిలో పని చేసిన వాళ్లను) సభ్యత్వం ఇచ్చింది. మొత్తం 1100కు పైగా సభ్యులయ్యారు. ప్రభుత్వం నిజాంపేట, పేట్‌ బషీరాబాద్‌లో ఉన్న 70 ఎకరాల స్థలాన్ని సొసైటీకి కేటాయిస్తూ (సర్వే నంబర్‌లతో సహా) జీవో జారీ చేసింది. ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేలోపు కోర్టులో కేసు. వాదనలు, ప్రతివాదనలతో ఏళ్లు గడిచిపోయాయి. ఈ మధ్యలో ఒకసారి ప్రభుత్వం నుంచి స్థలాన్ని సొసైటీ హ్యాండ్‌ఓవర్‌ చేసుకోవచ్చని, ప్లాట్ల పంపిణీ మాత్రం తదుపరి తీర్పు వెలువడే వరకు వేచి చూడాలని చెప్పింది. అప్పుడు నిజాం పేట, పేట్‌ బహీరాబాద్‌లలో ఉన్న స్థలాలను సొసైటీ హ్యాండ్‌ ఓవర్‌ చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ ఆవేదనలు, ఆందోళనలకు తావుండేది కాదు. ‘మన ప్లాట్‌ ఎప్పుడు వస్తుంది’ అని తెలిసిన అందర్నీ అడుగుతూ ఎదురు చూసి చూసి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల సంఖ్య ముప్పైకి పైగానే.

 

రెండు లక్షల పాట్లు
జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి డబ్బు కట్టడానికి పడిన పాట్లు వర్ణనాతీతం. ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు కట్టాల్సి వచ్చింది. జర్నలిస్టుల జీతాలు క్రీమీలేయర్‌ ఐదు శాతం మందికి మినహా మిగిలిన వాళ్లందరి పరిస్థితి హ్యాండ్‌ టు మౌత్‌ అన్నట్లే ఉంటుంది. అలాంటిది పదిహేనేళ్ల కిందట రెండు లక్షల రూపాయలు కట్టడానికి అందినకాడికి అప్పులు చేసిన వాళ్లు, బంగారు తాకట్లు పెట్టిన వాళ్లు, ఆఖరుకు పుస్తెలతాడు తాకట్టు పెట్టి డబ్బు అప్పు తెచ్చిన వాళ్లూ ఉన్నారు. అప్పటి నుంచి తమకు ఇంటి జాగా వస్తుందని, సొంతింటి కల నెరవేరుతుందని ఎదురు చూడడంతోనే గడిచిపోయింది.

దేవుడు వరమిచ్చాడు!

సుప్రీం కోర్టులో కేసు నడిచింది, నడిచింది. చివరికి ధర్మాసనం కనికరించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. భగవంతుడు మానుషరూపేణా వచ్చి ఆదుకున్నాడని సంతోషించారంతా. ఇది జరిగి ఐదు నెలలు దాటుతున్నప్పటికీ పేట్‌ బహీరాబాద్‌ సైట్‌ స్వాధీనం చేసుకోవడంలో మీనమేషాలు లెక్కపెట్టడం ఎందుకో అర్థం కాక సగటు సామాన్య జర్నలిస్టు పడుతున్న ఆవేదన మాటల్లో చెప్పలేనిది.

టవర్‌లు ఎక్కిదూకడానికా!

ఇంటి స్థలం ఎప్పుడు వస్తుందో తెలియక అయోమయంలో ఉండగానే మరో పిడుగుపాటులాంటి సమాచారం చాపకింద నీరులా ప్రవహిస్తోంది. అదేమిటంటే… ‘పేట్‌ బషీరాబాద్‌ స్థలం మీద ఆశ వదులుకోవాల్సిందే, నిజాం పేట స్థలంలోనే అందరికీ హై రైజ్‌ టవర్‌లు కట్టించి ఇవ్వడం మేలు కదా, స్థలం ఇచ్చినా ఇల్లు కట్టుకోవడానికి మన దగ్గర డబ్బులున్నాయా? ఫ్లాట్‌ కట్టించి ఇస్తే మనం నేరుగా గుమ్మడికాయ కొట్టి గృహ ప్రవేశం చేసుకోవచ్చు’ అంటూ నమ్మబలకడం. ఇది ఎవరి నుంచి మొదలైందో ఎలా విస్తరిస్తోందో కానీ ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న వాళ్లు కూడా ‘స్థలం వద్దు, ఫ్లాట్‌ చాలు’ అనే పాచికకు ప్రభావితమయ్యారు. నిజానికి హై రైజ్‌ టవర్‌లలో జీవితం ఎలా ఉంటుందో తెలిస్తే వాటిలో అడుగుపెట్టే సాహసం కూడా చేయరు. అందులోని జీవితాలు దూరం నుంచి కనిపించినంత అందంగా ఉండవు. వాటిలో మెయింటెనెన్స్‌ కింద వసూలు చేసే మొత్తాలు పది నుంచి పదిహేను వేల వరకు ఉంటాయి. సగటున ముప్పై వేల జీతంతో ఉద్యోగం చేసే జర్నలిస్టులను హై రైజ్‌ టవర్‌ల భ్రమలో ఉంచి పేట్‌ బషీరాబాద్‌ స్థలం మీద నుంచి దృష్టి మరిలింప చేసే దురాలోచన ఏదో జరుగుతుందనే ఆందోళన కేవలం ఆందోళన మాత్రమే కాదు. బతుకు భయం కూడా.
(స్థలాన్ని బిల్డర్‌ చేతిలో పెట్టిన తర్వాత ఎదురయ్యే సమస్యలను మళ్లీ చర్చిద్దాం)