త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున RRR బృందానికి సన్మానం చేయాలని నిర్ణయించామ‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డును అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రంగా RRR చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

 

ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతుందని చెప్పారు. ఆస్కార్ అవార్డును అందుకున్న గొప్ప చిత్రం RRR. ఈ చిత్రాన్ని నిర్మించిన డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.

 

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును (Oscar award) గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు’ (Natu Natu) పాటలో పొందుపరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి, అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని తెలిపారు.