చిత్రం: పేక మేడలు
బ్యానర్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2024-07-19
CBFC రేటింగ్: UA
నిడివి: 2 గం లు
నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు
డీవోపీ: హరిచరణ్ కే
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
మ్యూజిక్: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
నిర్మాత: రాకేష్ వర్రే
రచన, దర్శకత్వం: నీలగిరి మామిళ్ల
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి నటుడు రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పేక మేడలు’. రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. స్మరణ్ సాయి సంగీతం సమకూర్చారు. ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న ఈ చిత్రం సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే కథ, పాత్రలతో ఉండడం ఆసక్తి రేకెత్తించింది. ప్రీమియర్ షో లతో ముందే కొన్ని ప్రాంతాలలో ప్రదర్శనలు జరుపుకున్న పేక మేడలు జూలై 19 న అన్ని థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథ :
హైదరాబాదులో స్లమ్ ఏరియాలో ఉండే ఒక మధ్య తరగతి కుటుంబం. అందులో లక్ష్మణ్ (వినోద్ కిషన్) బీటెక్ చదువుకుని కూడా ఈజీ గా డబ్బు సంపాదించాలనుకుంటాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేస్తాడు. తన భార్య వరలక్ష్మి (అనూష కృష్ణ) కర్రీ పాయింట్ పెట్టుకుని కష్టపడి ఎదుగుదామనుకుంటుంది. లక్ష్మణ్ నుంచి ఇంటికి ఎలాంటి సపోర్ట్ ఉండదు. బాధ్యతారాహిత్యం, అత్యాశాలతో ఆన్లైన్ లో పేకాట ఆడుతూ అప్పులు చేసి తన కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెడతాడు. అనుకోని పరిస్థితుల్లో లక్ష్మణ్ కి శ్వేత (రితిక శ్రీనివాస్) పరిచయం అవుతుంది. అక్కడ నుంచి తన కుటుంబంలో అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. అసలు శ్వేతా కి లక్ష్మణ్ కి సంబంధం ఏంటి? వరలక్ష్మి తను అనుకున్నది సాధించిందా లేదా? చివరికి లక్ష్మణ్ మారి వరలక్ష్మికి సపోర్ట్ ఇచ్చాడా లేక లత్కోర్ లక్ష్మణ్ గా మిగిలిపోయాడా? తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు :
లక్ష్మణ్ పాత్రలో వినోద్ కిషన్ ఒదిగిపోయాడు. కన్నింగ్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. తన ఎక్సప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులు తన పాత్రతో కనెక్ట్ అయ్యేలా తన నటన ఉంది. ఇక వరలక్ష్మిగా మధ్యతరగతి భార్యగా అనూష కృష్ణ పాత్రకి నూటికి నూరు మార్కులు పడ్డాయి. పల్లెటూరి నుండి వచ్చిన బాధ్యత తెలిసిన అమ్మాయిగా పరిణితితో కూడిన నటన ప్రదర్శించింది. ఎన్ఆర్ఐ గా ఇండియాకి వచ్చిన పాత్రలో రితిక శ్రీనివాస్ బాగా నటించారు. మిగిలిన వారు తమ పాత్ర పరిధి మేరకు కథానుసారం నటించారు.
విశ్లేషణ:
పేకమేడలు స్టోరీ… మహిళా చైతన్యం అనే ప్రధానమైన పాయింట్ చుట్టూ అల్లుకొన్న కథ. దానికి ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే బస్తీ జీవితం బ్యాక్డ్రాప్ గా తీసుకున్నారు. దర్శకుడు నీలగిరి రాసుకొన్న సీన్లు, వాటిలో ఎమోషన్స్ కి ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా చేయగలిగారు. బస్తీ జీవితం, అక్కడ ఉండే వ్యక్తుల హావభావాలు, మనస్తత్వాలను బాగా తన పాత్రల్లో చూపించే ప్రయత్నం చేశారు. మూవీ ఫస్టాఫ్ చాలా సాఫీగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో మాత్రం కొంత సాగదీసినట్టు అనిపించినా కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే సీన్లు, ఎపిసోడ్స్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు తలవొగ్గకుండా మహిళ తన సొంతకాళ్ల మీద ఎలా ఆర్థికంగా ఎదుగవచ్చని.. ఆకట్టుకునేలా చెప్పిన విధానం బాగుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ ని పర్ఫెక్ట్ గా ప్రొజెక్ట్ చేసిన సినిమా గా పేక మేడలు ను చెప్పుకోవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ నిర్మాత రాకేష్ వర్రే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా నిర్మించారు. స్మరణ సాయి ఇచ్చిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. సన్నివేశాలు బాగా ఎలివేట్ అవడానికి తన సంగీతం ఎంతగానో ఉపకరించింది. డైలాగ్స్ అర్థవంతంగా కథకు తగ్గట్టుగా బాగున్నాయి. డిఓపి హరిచరణ్ కె. పనితీరు అద్భుతం, మూడ్ కి తగ్గట్టు తన కెమెరా పనితనం తో ఆకట్టుకుంటారు. సృజన అడుసుమిల్లి, హంజా అలీ ఎడిటింగ్ వర్క్ బాగుంది. దర్శకుడు నీలగిరి మామిళ్ల మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ని చూపించడంలో సఫలమయ్యారు. ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్ చేసుకుని ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు.
చివరగా : నేచురల్ & ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
రేటింగ్ : 3.25/5