మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో సంచలన విషయాలు జరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయన్న అంశం సంచలనం రేపుతోంది. హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్ నగర్ లోని ఓ ఫాం హౌజ్ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే భారీ డీల్ కు తెరలేచిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్లామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు అంటున్నారు. ఈ వ్యవహారంలో రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్ ను అరెస్ట్ చేశారు. 120 బీ, 171 బీ ఆర్ డబ్్యూ, 171 ఈ, 506 ఆర్ డబ్ల్యూ , 34 ఐపీసీ మరియు సెక్షన్ 8 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. బీజేపీలో చేరేందుకు 100 కోట్ల డీల్ నడిపినట్లు పైలట్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వామీజీ, నందు, సతీశ్ కలిసి తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు.

ఇక… ఈ విషయంపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడారు. డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ తమను కొందరు ప్రలోభ పెడుతున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వగా… సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు. అజీజ్ నగర్ లోని ఫాం హౌజ్ లో కొందరు సమావేశమయ్యారని తెలిసిందని, ఢిల్లీలోని ఫరీదాబాద్ ఆలయంలో వుండే రామచంద్ర భారతి వీరితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఫాం హౌజ్ లో రామచంద్ర భారతి తో పాటు తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజి, హైదరాబాద్ కు చెందిన నంద కుమార్ వున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు చేసి, పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు
ఫాం హౌజ్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ కే చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ కూడా చేరుకున్నారు. వీరందరూ సీఎం కేసీఆర్ తో మంతనాలు జరిపినట్లు సమాచారం. డబ్బులు, కాంట్రాక్టులతో వారిని ప్రలోభపెట్టిన వైనంపై.. ఈ వ్యవహారం వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న అంశంపై వారు చర్చించినట్లు తెలిసింది.