ఏపీ- తెలంగాణను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. దీనికి కేంద్రం ఓకే కూడా చెప్పేసింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకూ ఈ జాతీయ రహదారి వుండనుంది. దాదాపు 255 కిలోమీటర్ల నేల 4 లైన్ల రహదారి నిర్మాణం జరగనుంది. 4,706 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. దీనిని 7 ప్యాకేజీల కింద నిర్మిస్తారు. అందులో తెలంగాణలో 91 కిలోమీటర్ల రహదారిని 2,406 కోట్లతో నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధమైంది.

 

మొదటి ప్యాకేజీ కింద 886.69 కోట్లు, రెండో ప్యాకేజీ కింద 1,082.40 కోట్లు, మూడో ప్యాకేజీ కింద 436.91 కోట్లతో పనులు చేపట్టనుంది. ఇక ఏపీలో 164 కిలోమీటర్ల మేర 2,300 కోట్ల అంచనాతో ప్రణాళికలను రూపొందించారు. సిద్ధేశ్వరం నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకూ రహదారిని నిర్మిస్తారు. అందులో మొదటి ప్యాకేజీ కింద 62.57 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి 785 కోట్లతో డీపీఆర్ సిద్ధమైంది. మిగిలిన 3 ప్యాకేజీల కింద 1,151 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ ను రూపొందిస్తున్నారు.