హయత్ నగర్ నుంచి దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్లే ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. 32 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్ కూడలి సిగ్నల్ ఫ్రీగా మారింది. అయితే… ఎల్బీనగర్ చౌరస్తాకి తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని ప్రకటించారు. ఎస్ఆర్‌డీపీ కింద ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో మొత్తం 12 పనులను రూ. 650 కోట్లతో చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ 9వ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఇంకా మూడు ప్రాజెక్టులు మిగిలి ఉన్నాయన్నారు.
బైరామల్‌గూడలో సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, రెండు లూప్‌లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ పనులను పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎల్‌బీ నగర్ చౌరస్తా దాటాలంటే గతంలో 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బంది లేదని, ఈ ఫ్లై ఓవర్లు మాత్రమే కాదు.. ప్రజా రవాణా మెరుగుపడల్సిన అవసరం ఉందని అన్నారు. మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే. తప్పకుండా నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు మెట్రోను తీసుకువస్తామని హామీ ఇచ్చారు.