ఆచార్య బి. కృష్ణారెడ్డికి కేంద్రం పద్మశ్రీ ప్రకటించిన సందర్బంగా ఆత్మీయులు ఆయనకు రవీంద్ర భారతిలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, సహోద్యోగులు, సమకాలీనులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆచార్య బి. చెన్నకేశవ రెడ్డి వ్యవహరించారు. ఆచార్య ఎన్. భక్త వత్సల రెడ్డిగారు ప్రసంగిస్తూ కృష్ణారెడ్డిగారు హిందీభాషలో డిగ్రీ చదివి అప్పట్లోనే విశ్వవిద్యాలయంలో ప్రధమ స్థానంలో నిలిచారని, అప్పటినుండి అంచలంచెలుగా ఎదుగుతూ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన గిరిజన భాషలపై కృషిచేసిన మహనీయులని ప్రసంశించారు. ఆయన పరిశోధన నిరంతరాయంగా సుమారు 40, 50. సం. గా (1970 -2013 సం. వరకు) కొనసాగడం విశేషమన్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయాలు, ప్రముఖ సంస్థలు రామకృష్ణగారు పరిశోధనచేసిన 13 పుస్తకాలు ప్రచురించి వెలుగు లోనికి తెచ్చాయి! ఇంకా 9 పుస్తాకాలు ముద్రితానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు.
ఆచార్య రామకృష్ణా రెడ్డిగారు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, ఉస్మానియా విశ్వ విద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా, రిజిస్ట్రారుగా విధులను నిర్వహించడమే గాక, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో తమ సేవలను అందించారని కొనియాడారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఈయన ప్రతిభను గుర్తించాయని తెలియజేశారు. ఆయనతో తనకు గల అనుబంధాన్ని పాలు పంచుకొన్నారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు ఈశ్వర రెడ్డిగారికి ఆచార్య రామకృష్ణగారు స్వయాన మేనమామ! ఆయనతో తనకు గల అనుబంధాన్ని పాలుపంచుకొన్నారు. శ్రమతో మనుష్యులు ఎదుగుతారు! దానికి బుద్ధి తోడైతే విజయం తథ్యమని! దానికి నిలువెత్తు నిదర్శనం ఆచార్య రామకృష్ణా రెడ్డిగారని అన్నారు. “ వారి అమ్మ కష్టపడి పనులుచేసి ఆయన్ని చదివించిందని అందుకే ఆయన బహుభాష సేద్యం చేయగలిగాడని ఆ ఫలమే పద్మశ్రీ పురస్కారమని” తెలియజేశారు. “మీమామ లాగ చదవాలని మా అమ్మ అనేదని తనకు ఆయనే మార్గదర్శకత్వమయ్యారని” పేర్కొన్నారు. రామకృష్ణగారికి ప్రసంశాపత్రాన్ని ఈశ్వరరెడ్డిగారు రాశారు. ఆయనపై కవిత్వాన్ని చదివి వినిపించారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య ఆశీర్వాదంగారు ప్రసంగిస్తూ ఆయన ప్రోద్భలంతోనే తాను పి.హెచ్.డి భాషాశాస్త్రంపై చేశానని తాను ఇంతటి ఉన్నతస్థానానికి చేరుకోవడానికి కారణం మాగురువుగారైన రామకృష్ణారెడ్డిగారని కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పద్మశ్రీ కొలకులూరి ఇనాక్ గారు ప్రసంగిస్తూ ఆచార్య రామకృష్ణరెడ్డి గారికి మనసార శుభాభినందనలు తెలియజేశారు.

గౌరవ అతిథులుగా రసమయి అధ్యక్షులు, డా. ఎం.కె. రాము, తెలంగాణ భాష సాంస్కృతిక మండలి అధ్యక్షుడు డా. గంటా జలంధర్ రెడ్డి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు వి. సత్తిరెడ్డి, ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు, ఆచార్య చెన్నారెడ్డి, ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి, డా. పగడాల చంద్రశేఖర్ గారు తదితరులు ఆచార్య బి. కృష్ణారెడ్డిగారికి అభినందనలు తెలియజేశారు.
పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య బి. కృష్ణారెడ్డిగారు ప్రతిస్పందిస్తూ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. “భారతదేశంలో లిఖితపూర్వకమైన భాషలు చాలా తక్కువ ఉన్నాయని అన్నారు. మౌఖిక భాషలు ఎక్కువ ఉన్నాయని అటువంటి భాషలపై భావి పరిశోధకులు పరిశోధనలు కొనసాగించాలని” అన్నారు. అలాగే బంధుత్వ వాచకాలపై కూడా పరిశోధన చేయవచ్చని సూచించారు. వీరి దత్తపుత్రిక శ్రీమతి పద్మగారు తన తండ్రిగారు తనకు గల అనుబంధాన్ని పాలుపంచుకొన్నారు.