శ్రీరామ నవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఇందులో భాగంగా బిహార్ లోనూ పలు ప్రాంతాల్లోనూ అల్లర్లు రేగాయి. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. బిహార్ లో తాము అధికారంలోకి రాగానే… రాష్ట్రంలో హింసకు పాల్పడిన వారందర్నీ తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారు. బిహార్ లోని నవోదా ప్రాంతంలో అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.
అశోకచక్రవర్తి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సాసారామ్ వెళ్లాలని, కానీ అక్కడ పరిస్థితులు బాగోలేవని, మనుషులు చనిపోతున్నారని పేర్కొన్నారు. తుపాకులు కూడా పేలుతున్నాయని, అందుకే వెళ్లలేకపోయానని అందుకు ప్రజలకు క్షమాపణలు కూడా చెబుతున్నానని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే… అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నితీష్ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో నితీశ్ ఓడిపోవడం ఖాయమన్నారు. బిహార్ లో తామే అధికారంలోకి వస్తామని, 40 లోక్ సభ స్థానాల్లో కూడా తామే చేజిక్కించుకుంటామని ప్రకటించారు. సీఎం నితీష్ ప్రధాని కావాలన్న కలలు ఏమాత్రం నెరవేరవని అన్నారు. మూడో సారి కూడా మోదీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
శ్రీరామ నవమి సందర్భంగా బెంగాల్ హౌరాలో తీవ్ర హింస చెలరేగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కి ఫోన్ చేశారు. అసలు ఏం జరిగిందో పూర్తిగా నివేదిక ఇవ్వాలని అమిత్ షా ఆదేశించారు. మరోవైపు అసలు క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడానికి గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అల్లర్లు జరిగిన ప్రదేశాల్లో కూడా పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఘర్షణలు జరిగిన ప్రాంతాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో కూడా బెంగాల్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇప్పటి వరకూ 36 మందిని అరెస్ట్ చేశారు. కాజీపారా, శివపూర్ ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా హిందువు యువకులు ఏర్పాట్లలో నిమగ్నమై వుండగా…. కొందరు ముస్లిం యువకులు రాళ్లు రువ్వారు. దీంతో ఘర్షణ రేగింది.