హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి, ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలను గవర్నర్ కు పూర్తిగా వివరించానని తెలిపారు. తెలంగాణలో కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు దోచేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే తనను అరెస్ట్ చేశారని, కావాలనే శాంతిభద్రతల సమస్యను క్రియేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ భార్య ఆంధ్రా ప్రాంతం వారు కాదా? ఆయన భార్యను అందరూ గౌరవిస్తున్నారని, తనను కూడా అందరూ గౌరవించాలని సూచించారు. తాను ఇక్కడే పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని, హైదరాబాద్ లోనే పెళ్లి కూడా చేసుకున్నానని, భవిష్యత్తులోనూ ఇక్కడే వుంటానని స్పష్టం చేశారు.

 

ట్రాఫిక్ ఇబ్బంది లేకున్నా తనను అరెస్ట్ చేశారని, వాహనంలో ఉండగానే తీసుకెళ్లారని షర్మిల మండిపడ్డారు. తన పార్టీ కార్యకర్తలను పోలీసులు కొట్టారని, ట్రాఫిక్ వాయిలెన్స్ కేసు పెట్టి, రిమాండ్ ఎలా అడగుతారని షర్మిల ప్రశ్నించారు. తన పాదయాత్రను ఆపేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని, తనకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని షర్మిల హెచ్చరించారు.