ఎక్కడికక్కడ కట్టడి చేయడానికే ఆనంపై వేటు వేసిన వైసీపీ…

ఆనం రామ నారాయణ రెడ్డి… వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే. కొన్ని రోజులుగా తరుచుగా బహిరంగంగానే జగన్ సర్కార్ పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తప్పుబడుతూనే తీవ్ర వ్యాఖ్యలు చేసేస్తున్నారు. దీంతో సీఎం జగన్ ఆయనపై సీరియస్ అయ్యారు. ఆయన్ను పార్టీ పదవుల నుంచి తొలగించేశారు. దీంతో ఆనం ఇప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యేగానే కొనసాగుతారు. వెంకటగిరి వైసీపీ ఇంచార్జీగా ఆనం రామనారాయణ రెడ్డి కొనసాగుతున్నారు. తరుచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ… చికాకు పెడుతున్న నేపథ్యంలో ఆయన్ను పార్టీ పదవి నుంచి తొలగించేశారు. ఆయన స్థానంలో వెంకటగిరి ఇంచార్జీగా మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో నెల్లూరు జిల్లా పార్టీ కార్యకలాపాల్లో ఆనం పాత్రను వైసీపీ తగ్గించేసినట్లైంది.

ఇకపై పార్టీపై గానీ, ప్రభుత్వంపై గానీ ఎలాంటి విమర్శలు చేయకుండా కట్టడి చేసినట్లు అనుకుంటున్నారు. జూనియర్లే కాదు.. ఆనం లాంటి సీనియర్లు కూడా పార్టీపై, ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేయవద్దన్న పరోక్ష సంకేతాలు సీఎం జగన్ ఇచ్చారని అంటున్నారు. స్థానికంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట కాకుండా, కొత్తగా ఇంఛార్జి అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాలను పాటించాలని కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం క్రింది కేడర్ కి సూచనలు ఇచ్చేసింది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమ సమీక్షలోనూ సీఎం జగన్ సీరియస్ గానే వుంటున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాల్గొనని మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం జగన్ సీరియస్ అవుతున్నారు.

Related Posts

Latest News Updates