ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూప్ లో రాఘవ పేరు ప్రస్తావనకు వచ్చిందని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేశామని ఈడీ పేర్కొంది. ఈడీ అధికారులు రాఘవను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఈడీ రాఘవను ఇప్పటికే పలుసార్లు విచారించింది.
రాఘవ బాలాజీ గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. వాస్తవానికి శుక్రవారం రాఘవరెడ్డిని విచారించిన ఈడీ అధికారులు, సాయంత్రానికి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు అధికారికంగా ఆయన అరెస్ట్‌ను ప్రకటించారు. సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని మీటింగ్‌ల్లోనూ మాగుంట పాల్గొన్నట్టు సమాచారం. విచారణలో రాఘవరెడ్డి చాలా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ మధ్యలో తాజాగా ఈడీ ఇద్దర్ని అరెస్ట్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబును మూడు రోజుల క్రితం అరెస్ట్ చేసింది. దీని వెనువెంటనే పంజాబ్‌కు సంబంధించి ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో మరిన్ని విషయాలు బహిర్గతమయ్యాయి.
ఈ కుంభకోణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు తొలిసారి నేరుగా తెరపైకి వచ్చింది. అలాగే, తెలంగాణ సీఎం కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు సంబంధం ఉన్నట్టు ఈడీ పేర్కొంది. గత నెల 6న దాఖలు చేసిన 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్లో సమీర్ మహేంద్రు, విజయ్‌నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్ అరోరాలను నిందితులుగా పేర్కొంది.