మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి విచారణకు రావాలని సీబీఐ నుంచి తనకు ఎలాంటి నోటీసులూ రాలేదని వైఎస్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో నోటీసు ఇచ్చిన సందర్భంలో ఈ నెల 24 తర్వాత అందుబాటులో వుంటానని సమాచారం ఇచ్చానని, కానీ… ఇవాళ విచారణకు హాజరవుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అయితే… సీబీఐ విచారణకు ఎప్పుడు పిలిచినా… తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.
అయితే… శనివారం కడప జెంట్రల్ జైలు గెస్ట్ హౌజ్ లో విచారణకు హాజరవ్వాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ సూచించింది. అయితే… గతంలోనే భాస్కర్ రెడ్డికి నోటీసులిచ్చిన సీబీఐ.. ఈ నెల 23 న విచారణకు హాజరవ్వాలని సూచించింది. కానీ ఈ నెల 23 న జగరాల్సిన సీబీఐ విచారణకు హాజరుకాలేనని గతంలో లేఖ రాశారు. దీంతో మరోసారి నోటీసులిచ్చింది సీబీఐ. 25 న కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌజ్ లో విచారణకు రావాలని పేర్కొంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. దాదాపు 5 గంటల పాటు ఈ విచారణ సాగింది. అయితే.. విచారణ ముగిసిన తర్వాత అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యక్తిని టార్గెట్ గా చేసుకొనే, విచారణ అంతా సాగుతోందని మండిపడ్డారు. సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా సాగాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ సరైన దిశలతో వెళ్లాలని చెబుతున్నానే తప్ప.. అనుమానించడం లేదన్నారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాచారం అంతా చెప్పానని అన్నారు.