రాజీవ్ సిద్దార్థ్, భవానీ చౌదరి హీరోహీరోయిన్లుగా.. శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద హరి కుమార్ నిర్మిస్తోన్న చిత్రం ఏమైపోయావే. ఈ సినిమాకు విజయ్ కుమార్ కథను అందించగా.. రాజీవ్ సిద్దార్థ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ ఏమైపోయావే సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ఇప్పుడు ప్రకటించారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టే క్రమంలో ఈ చిత్రం నుంచి ఓ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మరిచేది నేనేలా అంటూ సాగే ఈ మెలోడియస్ సాంగ్ శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. తిరుపతి జావన రాసిన సాహిత్యం.. రామ్ చరణ్ గడిచెర్ల బాణీ.. అభయ్ జోధ్‌పుర్కర్ గాత్రం ఇలా అన్నీ కలిసి పాటను ఎంతో అందంగా మలిచాయి. ప్రేమలో గాఢతను చూపించేలా ఈ పాట కొనసాగింది. ఈ చిత్రానికి సంగీతం రామ్ చరణ్ గడిచెర్ల అందిస్తుండగా.. కెమెరామెన్‌గా శివ రాథోడ్ పని చేస్తున్నారు. మునేష్ ఆదిత్య ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ సిద్దార్థ్, భవానీ చౌదరిలతో పాటుగా.. భాషా, షాను, నామాల మూర్తి, సునీత మనోహర్, మిర్చీ మాధవి, మీసం సురేష్, నానాజి వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను మేకర్లు ప్రకటించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.