సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సహా తమిళంలో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన తమిళ కథా రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 86 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా వయోభారం అనారోగ్యంతో రీత్యా ఇబ్బంది పడుతున్న ఆయన ఈ ఉదయం 8:45 నిమిషాలకు కన్నుమూసినట్లు ఆయన కుమారుడు, తెలుగు-తమిళ సినీ రచయిత భూపతి రాజా మీడియాకు వెల్లడించారు. తెలుగులో బాలమురుగన్ ధర్మదాత, ఆలుమగలు, సోగ్గాడు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందించారు.
అలాగే ఆయన గీతా ఆర్ట్స్ మొదటి సినిమా బంట్రోతు భార్య సినిమాకు కూడా బాల మురుగనే కధ అందించారు. ఇక శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన సోగ్గాడు సినిమా ఎంత భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమిళంలో స్టార్ హీరోగా ఒకప్పుడు చక్రం తిప్పి శివాజీ గణేషన్ కి దాదాపు 30 నుంచి 40 సినిమాలకు బాలమురుగన్ కథలు అందించారు. బాలమురుగన్ మృతి చెందారు అన్న విషయం తెలుసుకున్న తమిళ, తెలుగు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.