దిగ్విజయంగా ముగిసిన మొదటి రెండు రోజుల 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు”

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, న్యూజిలాండ్ తెలుగు సంఘం, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, మలేషియా తెలుగు సంఘం, వంశీ ఆర్ట్ థియేటర్స్ భారతదేశం, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు తల్లి కెనడా, సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు రూపకల్పన చేయబడిన ఈ కార్యక్రమం తొలి రెండు రోజులు “న్యూజిలాండ్ తెలుగు సంఘం” వారి 25వ వార్షికోత్సవ సందర్భంగా ఆక్లాండ్ మహానగరంలో శనివారం ప్రారంభమై, భారతకాలమానం ప్రకారం అంతర్జాలంలో ఆదివారం మధ్యాహ్నం వరకు జరిగింది.

 

ప్రారంభ సభలో భారతదేశం నుండి కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వోలేటి పార్వతీశం, అమెరికా నుండి వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు, మల్లిక్ పుచ్చా, న్యూజిలాండ్ తెలుగు సంఘం సమన్వయకర్త మగతల శ్రీలత, అధ్యక్షురాలు అనిత మొగిలిచెర్ల, సునీల్, ఆస్ట్రేలియా నుంచి గొల్లపూడి విజయ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ వెదికలో వేదికపై న్యూజీలండ్ నుంచి వెలువడిన మొట్ట మొదటి తెలుగు కథాసంపుటి “ప్రవాస చందమామ కథలు (సతీష్ గొల్లపూడి రచన). కవి జొన్నవిత్తుల గారి విమాన వేంకటేశ్వర శతకం, మరో మాయాబజార్ – కథాసంపుటి (రాధిక మంగిపూడి) అమెరికోవిడ్ కథలూ-కాకరకాయలూ (వంగూరి చిట్టెన్ రాజు), డయాస్పోరా కథానిక -16వ సంకలనంతో సహా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురించిన ఐదు పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి.

 

ప్రారంభ వేదిక అనంతరం, రెండవ వేదిక నుండి ప్రారంభమై 16 గంటల పాటు అంతర్జాలంలో 25 దేశాలనుండి సుమారు 100 మంది వక్తల ప్రసంగాలతో ఈ సదస్సు కొనసాగింది. ఈ అంతర్జాల వేదికలకు ప్రారంభ ఉపన్యాసం సినీకవి శ్రీ భువనచంద్ర అందించగా, సంగీత దర్శకులు స్వర వీణాపాణి సదస్సుకొరకు ప్రత్యేకించి ఒక అంకిత గీతాన్ని రచించి స్వరపరిచి ఆలపించారు. మలేషియా మరియు అమెరికా నుండి రెండు చర్చా వేదికలు కూడా నిర్వహింపబడ్డాయి. పద్య ఆలాపన, దేశభక్తి సాహిత్యం మీద వోలేటి పార్వతీశం గారి ఉత్తేజపూరితమైన ప్రసంగం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 

అంతర్జాల వేదికపై కెనడాకు చెందిన రచయిత్రి కొమరవోలు సరోజ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకొనగా, ముగింపు సమావేశ సమయంలో ఓలేటి పార్వతీశం జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించబడ్డారు. న్యూజిలాండ్ వేదికలలో అక్కడ నివసించే తెలుగు రచయితలు, కవులు తమ ప్రసంగాలను అందించగా, మొత్తం 26 గంటల పాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం వివిధ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. రెండవ రోజు ప్రత్యక్ష వేదిక మీద కవి జొన్నవిత్తుల తన శతకంలోని పద్యాలను వినిపించారు.

 

“ప్రత్యేకంగా భారతీయ వక్తల, అతిధుల ప్రసంగాలతో అక్టోబర్ 2వ తేదీ ఈ సదస్సు యొక్క మూడవరోజు కార్యక్రమం అంతర్జాలంలో మరొక 12 గంటల పాటు నిర్వహించబోతున్నామని” సదస్సు ముఖ్య నిర్వాహకులు వంగూరి చిట్టిన్ రాజు తెలిపారు.

 

సహ నిర్వాహక సంస్థల ప్రతినిధులుగా డా. వంశీ రామరాజు, శాయి రాచకొండ, రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, రాపోలు సీతారామరాజు, డా వెంకట ప్రతాప్, లక్ష్మీ రాయవరపు, డా. వెంకట్ తరిగోపుల కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు. సింగపూర్ సాంకేతిక ప్రత్యక్ష ప్రసార కేంద్రంగా నడిచిన ఈ కార్యక్రమానికి గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, మధు చెరుకూరి తదితరులు సాంకేతిక నిర్వాహకులుగా సేవలందించారు.

Related Posts

Latest News Updates