ప్రపంచ దేశాల దృష్టి అంతా భారత దేశ బడ్జెట్ పైనే వుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత్ ఎలాంటి బడ్జెట్ ముందుకు తెస్తుందోనని ఆసక్తి నెలకొందన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో మోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఓ మహిళ అని, దేశ ప్రజల అంచనాలు, ఆదరాన్ని చూరగొనేలా బడ్జెట్ ప్రవేశపెడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి సీతారామన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
మొదటి సారిగా పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించడం రాజ్యాగానికి, మహిళలకు ఎంతో గర్వకారణం అన్నారు. ఇండియా ఫస్ట్, సిటీజన్ ఫస్ట్ అన్న ధ్యేయంతో ఈ బడ్జెట్ సమావేశాలను ముందుకు తీసుకెళ్తామని, విపక్ష నేతలందరూ తమ తమ అభిప్రాయాలను సభ ముందు వుంచాలని కోరారు. నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, రాష్ట్రపతి తొలిసారిగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని మోదీ తెలిపారు.
నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 11 గంటలకు ఉపన్యసించనున్నారు. రాష్ట్రపతిగా ముర్ము బాధ్యతలను స్వీకరించిన తర్వాత పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించడం ఇదే మొదటి సారి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎకనమిక్ సర్వేను సభ ముందు ప్రవేశపెట్టనుంది. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గురువారం నుంచి ఉభయ సభల్లోనూ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. దీనిపై ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో జవాబులివ్వనున్నారు. ఈ ప్రసంగం పూర్తి కాగానే బడ్జెట్ పై చర్చ మొదలవుతుంది. దీనిపై ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ జవాబివ్వనున్నారు.












