జీవితం అంటే ఏమిటి ?

జీవితం అంటే ఏమిటి ? ఈ ప్రశ్నను చాలామంది నన్ను అడిగారు. చాలా సందర్భాలలో అడిగారు. అడిగిన ప్రతివారికీ ఒక్కొక్క జవాబు చెప్పాను. ఒకరికి చెప్పింది ఇంకొకరికి చెప్పలేదు. ‘ఎందుకలా ఒక్కొక్కరికి ఒక్కొక్క జవాబు చెబుతున్నావు?’ – అని నాకు బాగా దగ్గరవాళ్ళూ, నన్ను దగ్గరగా గమనించే వాళ్ళూ అడిగారు.
‘ఎందుకంటే – ఎవరి జీవితం వారిది కాబట్టి, ఎవరి జవాబు వారిదే అవుతుంది’ అని వారికి చెప్పాను.
జీవితాన్ని నేను అనేక రకాలుగా నిర్వచిస్తూ ఉంటాను. వాటిలో ఒకటి ఇప్పుడు చెబుతున్న నిర్వచనం.
‘జీవితమంటే – లేనిదానికోసం వెదకడం. ఎదురుగా ఉన్నదాని విలువను గుర్తించలేకపోవడం’ అని కొందరికి చెప్పాను. ఎందుకంటే, వాళ్ళు చేస్తున్నది అదే కాబట్టి.
కొద్దిగా ఆలోచిస్తే ఇది నిజమని మీలో చాలామందికి అనిపిస్తుంది. మీకు నిజంగా ఆలోచనాశక్తి ఉంటే.
మనలో చాలామంది ఇదే చేస్తూ ఉంటాం. ఎదురుగా ఉన్నదాని విలువను గుర్తించాలంటే చాలా తేలికని మనం అనుకుంటాం. కానీ అసలైన కష్టం అదే. మన ఎదురుగా ఉన్నప్పుడు ఏదైనా సరే, అదంత విలువైనదిగా మనకు అనిపించదు. ఒకవేళ మొదటి రోజున అనిపించినా రెండో రోజుకు ఆ విలువ తగ్గిపోతుంది. మూడో రోజుకు మరీ తగ్గిపోతుంది. చివరకు అదొక విలువలేనిదిగా మనకనిపిస్తుంది. అది మానవ నైజం.
ఎందుకంటే, మనలో ప్రతివారికీ మనమేంటో తెలుసు. మనలో ఉన్న తక్కువతనం ఏంటో తెలుసు. మనమెంత పనికిరానివాళ్ళమో తెలుసు. కనుక, మనలాంటి వాళ్లకు ఇంత ఉన్నతమైనవి దొరుకుతాయా అని మన సందేహం. కాబట్టి మనకు దొరికినవీ, మన ఎదురుగా ఉన్నవీ, మనలాగే పనికిరానివని మనలో ప్రతివాడూ లోలోపల అనుకుంటూ ఉంటాడు.
అందుకే పక్కింటి పుల్లకూర రుచిగా అనిపిస్తుంది. కానీ అది పుల్లకూరే అన్నది నిదానంగా అర్ధమౌతుంది. అసలైన పుల్లయ్యలమూ పుల్లమ్మలమూ మనమేనన్నది ఇంకా నిదానంగా అర్ధమౌతుంది.
మనలో ప్రతివారి దృష్టీ ఎక్కడో చుక్కలలో ఉంటుంది. కనుక మన పక్కనే ఉన్నదాని విలువ మనకు అర్ధం కాదు. అది భార్యైనా, భర్తైనా, స్నేహితులైనా, గురువైనా ఎవరైనా ఇంతే. అయితే, అందరూ ఇలాగే ఉంటారా? అంటే, ఉండరనే చెప్పాలి. అందరూ అలా ఎందుకుంటారు? జీవితం మనకిచ్చిన వాటి విలువను గుర్తించేవాళ్ళు కూడా అక్కడక్కడా ఉంటుంటారు. కానీ చాలామంది ఆ విలువను గుర్తించలేనివాళ్ళే అయి ఉంటారు. అలా గుర్తించిన కొద్దిమందినీ తమ చెత్త లాజిక్స్ తో చెడగొట్టాలని చూసేవాళ్ళే అయి ఉంటారు.
ఈ రోజుల్లో మీరొక విచిత్రాన్ని గమనించవచ్చు. అరవై ఏళ్ళు వచ్చినా మూడు జేబుల్లో మూడు మొబైల్ ఫోన్స్ పెట్టుకుని క్షణం తీరిక లేకుండా వాటిలో మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నవాళ్ళు మీకీరోజున ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళేదో పెద్ద బాధ్యతాపరులని, ఆ వయసులో కూడా ఇంకాఇంకా కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారని మీరనుకుంటే పప్పులో కాలేసినట్లే. నా దృష్టిలో అలాంటివాళ్ళు బుర్రలేనివాళ్ళు. అలాంటి వారిని చూస్తే నాకు చాలా జాలి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే – అరవైఏళ్ళుగా సాధించలేనిది ఇక ఆపైన సాధించడానికి ఏముంటుంది గనుక?
ఆ రకంగా అరవై డబ్భైలలో కూడా క్షణం తీరిక లేకుండా నిరంతరం ‘డబ్బు డబ్బు’ అంటూ కలవరించే వారిని మీరొక మాట అడిగి చూడండి. నేను చెప్పేదానిలో నిజం మీకే అర్ధమౌతుంది.
‘జీవితంలో మీరు కోరుకున్నది మీరు నిజంగా పొందగలిగారా? మీరు నిజంగా శాంతిగా సంతృప్తిగా ఉన్నారా?’
‘లేదు’ అనే జవాబు వస్తుంది. ‘పొందాను, ఉన్నాను’ అని వస్తేమాత్రం ఆ వ్యక్తికి జీవితమంటే సరియైన అవగాహన లేదని అర్ధం. లేదా అది అబద్ధమని అర్ధం. ఈ రెండూ తప్ప మూడో చాయిస్ ఉండదు.
ఎందుకంటే – కనీసం వాళ్ళు కట్టుకున్న ఇంట్లో వాళ్ళే హాయిగా ఉండే యోగ్యత ఈరోజుల్లో ఎంతమందికుంది? తమ సంపాదనను చక్కగా అనుభవించే యోగ్యత ఎంతమందికుంది? ఇల్లు కట్టించేది ఒకరైతే, దాంట్లో ఉండేది మరొకరు, సంపాదన ఒకరిదైతే, దాన్ని ఎంజాయ్ చేసేది మరొకరు. ఈ రెండు ఉదాహరణలు చాలు, మనిషి బ్రతుకుతున్నాడేగాని జీవించడం లేదని చెప్పడానికి. కాదా?
అందుకే ఏ మాత్రం నిజాయితీ ఉన్న ఏ మనిషైనా ఇదే చెబుతాడు.
ఎందుకిలా బ్రతికానో అర్ధం కావడం లేదు’ – అనే ప్రతివాడూ అంటాడు. అతనికి ఏమాత్రమైనా ఆలోచనా శక్తీ, పరిశీలనా శక్తీ, నిజాయితీ గట్రాలు ఉన్నట్లయితే.
అవి లేని మామూలు మనుషుల గురించి, చవకబారు మనుషుల గురించి, ఆ వయసులో కూడా ఇంకా డబ్బనీ, షేర్ మార్కెట్లనీ, రియల్ ఎస్టేటనీ ప్రాకులాడే క్షుద్రజీవుల గురించి అసలు మనం మాట్లాడుకోవడమే అక్కర్లేదు. వాళ్ళు మన చర్చకు ఏమాత్రమూ తగరు.
జీవితమంటే – అనవసరమైన వాటికోసం, సిల్లీ విషయాల కోసం, జీవితమంతా పరిగెత్తి పరిగెత్తి చివరకు అసంతృప్తితో జీవితాన్ని చాలించడం తప్ప ఇంకేమీ లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పరమసత్యం. ఎందుకంటే, మహామహా వాళ్ళకే ఈ అసంతృప్తి తప్పలేదు, ఇక జీవితమంతా డబ్బుకోసం, ఆస్తులకోసం, సుఖాలకోసం ప్రాకులాడే అల్పజీవుల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా?
దీనికల్లా కారణం ఒక్కటే – ఎదురుగా ఉన్నదాని విలువను గుర్తించలేక పోవడం. ఎక్కడో ఏదో ఉన్నదని పరిగెత్తి పరిగెత్తి చివరకు చతికిల బడటం. ఈలోపల జీవితం కాస్తా చేతుల్లోంచి జారిపోవడం. చివరికి ఎందుకు బ్రతికామో అర్ధంకాక ఏడుస్తూ చావడం. ఎవరి జీవితమైనా ఇంతే. అయితే ఇక్కడొక విచిత్రం ఉంది.
పరిగెట్టుతున్నంత సేపూ పరుగు నిజమే అనిపిస్తుంది. ఆపిన తర్వాతే అదెంత అసంబద్ధమైన పనో అర్ధమౌతుంది. కానీ అప్పుడు చేసేదేమీ ఉండదు. ఇదే జీవితంలో అసలైన కామెడీ.
కనుక నిజంగా తెలివైనవాడు ఏం చెయ్యాలి?
సరియైన పరుగు పరిగెత్తాలి. దానికంటే ముందుగా, ఆ సరియైన పరుగు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత సరిగ్గా పరుగెత్తాలి. పరుగెత్తుతున్నప్పుడు కూడా ‘ఈ పరుగు నిజంకాదు’ అన్న స్పృహలో ఉంటూ పరిగెత్తాలి. ‘నేను పరిగెత్తడం లేదు’ అన్నది ఫీలౌతూ పరిగెత్తాలి.
జీవితం నిజం కాదన్న స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే జీవితం నిజం అవుతుంది. తాను పరుగెట్టడం లేదన్న స్పృహలో ఉన్నప్పుడే అది నిజమైన పరుగు అవుతుంది. జీవితం విలువను సరిగా గుర్తించి సరిగా బ్రతికినప్పుడే అది జీవితం అవుతుంది. లేకపోతే మామూలు బ్రతుకు అవుతుంది.
కానీ ఇంత సింపుల్ గా కనిపిస్తున్న ఈ పనిని ఎవ్వరూ చెయ్యలేరు. ఇన్ని వందలకోట్ల ప్రపంచజనాభాలో కూడా ఈ పనిని నిజంగా చెయ్యగలిగేవాళ్ళు ఒక పదిమంది ఉంటారో లేదా వాళ్ళు కూడా ఉండరో? అదే మాయంటే.
ఈ మాయకు ఎవరూ అతీతులు కారు. దీనికి ఎవరూ మినహాయింపు కారు. ఎవరూ దీనికి భిన్నంగా లేరు.
మీరున్నారా? గుండెల మీద చెయ్యేసుకుని, నిజాయితీగా చెప్పండి చూద్దాం.!!
మీ
కంభంపాటి నాగఫణిశర్మ

Related Posts

Latest News Updates