తమిళనాడులోని చెన్నైలో ఇద్దరు యువతులు ప్రేమించుకోవడమే కాకుండా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యుల సమక్షంలో తమిళ బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఇద్దరు తమ తండ్రుల ఒడిలో కూర్చుని పూలదండలు మార్చుకున్నారు. పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతుల్లో ఒకరు తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుబిక్ష సుబ్రమణి కాగా.. మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన టీనా దాస్. ఈ వివాహానికి తమ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారని కలలో కూడా ఊహించలేదని సుబిక్ష ఆనంద తెలిపారు. ఈమె తల్లిదండ్రులు కెనడాలోని కల్గేరిలో సెటిల్ అయ్యారు. సుభిక్ష భార్య టీనా దాస్ బంగ్లాదేశ్‌లోని కన్జర్వేటివ్ హిందూ కుటుంబానికి చెందినవారు. ఈమె కూడా కల్గేరీలోనే నివసిస్తున్నారు. ఆరేళ్లు తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెద్దలు ఒప్పించడానికి ఇంత సమయం పట్టిందని సుబిక్ష చెప్పారు. బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో తమ పెళ్లి జరగడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.