భారత్‌లో తాము ఏ ఉద్యోగినీ బలవంతంగా తొలగించలేదని, తాము ఇచ్చిన ప్యాకేజీని అంగీకరించి కొందరు ఉద్యోగులు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగారని అమెజాన్ కేంద్రానికి తెలిపింది. ఉద్యోగులపై తొలగింపుపై వివరణ ఇవ్వాలని కోరుతూ కార్మిక శాఖ అమెజాన్‌కు నోటీస్‌లు ఇచ్చిన సంగతి తెల్సిందే. కంపెనీలో ఉద్యోగులను చట్ట విరుద్ధంగా తొలించారని కేంద్ర కార్మిక శాఖకు నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్( ఎన్‌టీఈఎస్) కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. దీనిపై కార్మిక శాఖ నోటీస్ జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖకు సమాధానం ఇచ్చింది. ఏటా అన్ని విభాగాల్లోని ఉద్యోగులపై సమీక్ష నిర్వహిస్తుంటామని, పునర్వ్యవస్థీకరణ అవసరమని భావిస్తే పరిహారం చెల్లిస్తుంటామని పేర్కొన్నది. ఇందులో బలవంతం ఏమీ లేదని, తమ ప్యాకేజీని అంగీకరిస్తే ఉద్యోగులు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలగవచ్చని, లేదంటే ప్యాకేజీని తిరస్కరించే వెసులుబాటును ఉద్యోగులకు కల్పిస్తున్నామని అమెజాన్ పేర్కొన్నది. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అమెజాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.












