టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఏ1 నిందితుడిగా చేర్చి, కేసు నమోదు చేశామని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రకటించారు. ప్రశ్నాపత్రం కేసులో ఏ1గా బండి సంజయ్, ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేష్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చినట్లు పేర్కొన్నారు. 10బీ, 420, 505 సెక్షన్ల కింద బండి సంజయ్ పై కేసులు నమోదు చేశామన్నారు.

నిందితుడు బూర ప్రశాంత్ గతంలో జర్నలిస్టుగా పనిచేశాడని, ప్రస్తుతం అతనికి ఏ మీడియా సంస్థతో సంబంధం లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు. ప్రశాంత్‌, మహేష్‌ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్‌ (Bandi Sanjay)కు పంపారని, బండి సంజయ్‌కు ఉదయం 11.24 గంటలకు క్వశ్చన్‌ పేపర్ చేరిందని సీపీ వెల్లడించారు.

ఏ2 ప్రశాంత్‌ ఎమ్మెల్యే ఈటలకు ఉదయం 10.41 గంటలకు పేపర్ పంపాడని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని, అరెస్ట్ సమయంలో బండి సంజయ్‌ తన దగ్గర ఫోన్‌ లేదన్నారని సీపీ చెప్పారు. ప్రశ్నాపత్రం పంపాక ప్రశాంత్ 149 మందితో మాట్లాడాడని, పేపర్ లీక్‌కు ముందు రోజు బండి సంజయ్‌, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని సీపీ తెలిపారు.

 

ప్రశ్నాపత్రం ఫార్వర్డ్ అయిన అందరిపై తాము కేసు నమోదు చేయలేదని సీపీ రంగనాథ్ అన్నారు. ఓ జర్నలిస్టు విధుల్లో భాగంగా అప్పటికే వివిధ గ్రూపుల్లో వచ్చిన ప్రశ్నా పత్రాన్ని హైద్రాబాదులో వున్న మీడియా హెడ్స్ కి పంపారని, 11:20 నిమిషాలకు బూర ప్రశాంత్ దానిని బండి సంజయ్ కి వాట్సాప్ లో పంపారని తెలిపారు. చాలా మందికి ప్రశాంత్ ఫార్వర్డ్ చేశార్నారు. ఎమ్మెల్యే ఈటలతో పాటు పలువురు బీజేపీ నేతలకు కూడా ప్రశ్నాపత్రం పంపారని పేర్కొన్నారు. అయితే.. ప్రశ్నాపత్రం ఫార్వర్డ్ అయిన అందర్నీ తాము అరెస్ట్ చేయలేదని, విచారించడం లేదన్నారు. అంతకు ముందు జరిగిన పరిణామాల విషయంలోనే చర్యలకు పూనుకుంటున్నామని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు.

 

అయితే.. బండి సంజయ్ ఫోన్ ఇవ్వడం లేదని, ఎక్కడుందో తెలియదంటున్నారని అన్నారు. ఫోన్ ఇస్తే కీలక సమాచారం అంతా బయటకు వస్తుందని సీపీ అన్నారు. అయినా.. బండి సంజయ్ ఫోన్ కాల్ డేటా సేకరిస్తామని అన్నారు. అయితే… ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారన్న దానిపై కూడా సీపీ క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో సెక్షన్ 41ఏ సీఆర్పీసీ ప్రకారం వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చన్నారు. కక్షపూరితంగా బండి సంజయ్ అరెస్ట్ అనేది అవాస్తవమని అన్నారు. ఎంపీ బండి సంజయ్ అరెస్టుపై లోక్ సభ స్పీకర్ కి కూడ సమాచారం ఇచ్చామన్నారు.