వరంగల్ మెడికో పీజీ విద్యార్థి ప్రీతిని టార్గెట్ గా చేసుకొనే సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించాడని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. వాట్సాప్ గ్రూపులో మెసేజ్ ల ద్వారా అవమానించడం కూడా ర్యాగింగ్ కిందికే వస్తుందని స్పష్టం చేశారు. గ్రూప్ లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానించాడని, ఆ ఆధారాలు తమ వద్ద వున్నాయని వెల్లడించారు. 4 నెలలుగా సైఫ్ విద్యార్థి ప్రీతిని వేధిస్తున్నాడని, గ్రూప్ లో మెసేజ్ పెట్టి, వేధించొద్దని ప్రీతి వేడుకుందని పేర్కొన్నారు.

 

సైఫ్ చెప్పే దాంట్లో అస్సలు వాస్తవాలే లేవని, టార్గెట్ చేసి మరీ ప్రీతిని వేధించాడని తెలిపారు. కేస్ షీట్ విషయంలో సైఫ్ ప్రీతిని అవమానించేలా మాట్లాడాడని, బ్రెయిన్ లేదంటూ అవహేళన చేశాడని తెలిపారు. తనను ఉద్దేశించి గ్రూప్ లో వ్యక్తిగతంగా చాట్ చేయడం సరికాదని, ఏదైనా వుంటే HOD కి చెప్పాలని ప్రీతి పేర్కొందని సీపీ వెల్లడించారు. సైఫ్ తనను టార్గెట్ చేస్తూ వేధిస్తున్నాడని ప్రీతి స్నేహితులతో కూడా చెప్పిందని వెల్లడించారు.

 

ప్రీతి చాలా తెలివైన అమ్మాయి అని, చాలా సున్నితమైన మనిషి అని సీపీ అన్నారు. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడన్నారు. ప్రీతికి సహకరించవద్దని తన స్నేహితులకు చెప్పాడన్నారు. ప్రీతిని సైఫ్ ఉద్దేశపూర్వకంగానే వేధించాడని రంగనాథ్ స్పష్టం చేశారు. కేస్ షీట్ విషయంలో ప్రీతిని అవమానించేలా మాట్లాడాడని, ఈ నెల 18 న వాట్సాప్ గ్రూప్ లో అతడు పెట్టిన మెసేజ్ పై ప్రీతి పర్సనల్ గా ప్రశ్నించిందన్నారు. మొదటి నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బందిగా భావించిందని, గత యేడాది రెండు మూడు సార్లు చిన్న ఘటనలు కూడా జరిగాయన్నారు.