భారత దేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఎస్‌సీవో సదస్సు వేదికగా ప్రకటించారు. సభ్య దేశాలన్నీ కలిసి కట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎస్‌సీవో సదస్సులో కీలక ప్రసంగం చేశారు. ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య సహకారాన్ని భారత్ సమర్థిస్తుందని, అయితే… ఎలా ముందుకు సాగాలో అందరూ ఆలోచించాలని కోరారు. తమ ప్రాంతంలో వైవిధ్యభరిత సరఫరా గొలుసును సృష్టించేందుకు సదస్సు ప్రయత్నించాలని మోదీ పిలుపునిచ్చారు. అయితే.. దీనికి కేవలం మెరుగైన అనుసంధానం మాత్రమే సరిపోదని, మెరుగైన రవాణా సదుపాయాలు కూడా అవసరమని మోదీ నొక్కి చెప్పారు.
కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనివల్ల ప్రపంచం మునుపెన్నడూ లేని స్థాయిలో ఇంధనం, ఆహార సంక్షోభాలను ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసును అమలులోకి తేవాలన్నారు.
ప్రజల కేంద్రంగా అభివృద్ధి విధాన్ని అమలు చేయడంపై తాము దృష్టిపెట్టామని తెలిపారు. ప్రతి రంగంలోనూ సృజనాత్మకత, నవకల్పనలకు మద్దతిస్తున్నామని, సహకరిస్తున్నామని చెప్పారు. నేటికి భారత దేశంలో 100కుపైగా యూనికార్న్‌లు, 70,000కుపైగా స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7.5% చొప్పున వృద్ధి చెందుతుందని అంచనాకు వచ్చామని, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నానని మోదీ ప్రకటించారు.