విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, నిర్వాసితులు గాజువాకలో తీవ్ర ఆందోళన నిర్వహించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు, నిర్వాసితులు భారీ ర్యాలీ చేశారు. విశాఖలోని డీఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ వరకూ ర్యాలీగా బయల్దేరారు. అయితే.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొద్ది రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో వీరు ఈ నిరసన చేపట్టారు.
అయితే… ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గాజువాక పీఎస్ కి తరలించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ సమస్యను ప్రధాని మోదీకి తెలియ జేసేందుకు తాము శాంతియుతంగానే నిరసన చేస్తున్నామని, అయినా పోలీసులు అడ్డుకున్నారని నిరసనకారులు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము అంగీకరించమని స్పష్టం చేశారు.