హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ప్రతిష్టంభన తొలగిపోయింది. మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయడానికి అనుమతిస్తామని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతించమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నిర్ణయంపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతి యేడాది లాగే యథావిథిగా ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిరాహార దీక్షకు దిగింది. చివరికి ప్రభుత్వం దిగొచ్చి… ఎప్పటి లాగే యథావిధిగా నిజమజ్జనానికి ఏర్పాట్లు చేస్తామని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కూడా అనుమతిస్తామని చెప్పడంతో ప్రతిష్టంభన తొలిగిపోయింది. నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు.
హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శానిటేషన్ వాటర్ వర్క్, జీహెచ్ఎంసీ సిబ్బంది. హార్టికల్చర్ సిబ్బందితో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు అందరూ రంగంలోకి దిగారు. ట్యాంక్ బండ్ ప్రాంతంలో నిమజ్జనోత్సవం సందర్భంగా 20 వేల మందితో పోలీసులు బందోబస్తు చేపట్టారు. ట్యాంక్ బండ్ పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్ లో 9, పీవీ మార్గ్ లో 8 క్రేన్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఇక… నిమజ్జన విధుల్లో 10 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బందిని నియమించామని, పర్యవేక్షణకు 168 మందిని నియమించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. 74 ప్రాంతాల్లో బేబీ పౌండ్స్ ని కూడా ఏర్పాటు చేశారు.
సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు…
కీలకమైన నిమజ్జనోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే గాక… సిటీ వ్యాప్తంగా ఆంక్షలు అమలులో వుంటాయని సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం మధ్యాహ్నం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో వుంటాయి. విగ్రహాల నిమజ్జనం తర్వాత తిరిగి వెళ్లే వాహనాల కోసం ప్రత్యేక రూట్ ను ఏర్పాటు చేశారు. నిమజ్జనం చూడడానికి వచ్చే భక్తులు వ్యక్తిగత వాహనాల్లో కంటే ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ లను ఎన్నుకోవాలని పోలీసులు సూచించారు. దాదాపు 30 గంటల పాటు ప్రైవేట్ బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకు సిటీలోకి అనుమతి వుండదని పోలీసులు ప్రకటించారు.