యాదాద్రి లో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు ఉపసంహరించాలని వీహెచ్ పీ డిమాండ్ చేసింది. హిందువులను దోచుకోవడమే దేవాదాయ శాఖ పనిగా పెట్టుకుందని వీహెచ్ పీ రాష్ట్ర సహ కార్యదర్శి రావినూతల శశిధర్ మండిపడ్డారు. పార్కింగ్ దగ్గరి నుంచి మొదలు పెడితే దేవుని దర్శనాలు తీర్ధ ప్రసాదాల వరకూ హిందువులను దోచుకోవడమేనని, దేవాలయాలతో వ్యాపారం చేయడమే దేవాదాయ శాఖ పనిగా మారిందని మండిపడ్డారు. ఇప్పటికే దేవాలయాల భూములు మరియు ఆస్తులు వేలం వేసి అమ్ముకుంటున్న తెలంగాణా ప్రభుత్వం దేవుడి దర్శనాలను కూడా వ్యాపారం చేసుకుంటూ భక్తుల విశ్వాసాలతో ఆటలాడుతోందని ఆయన ఆక్షేపించారు.
భక్తులను ఆర్థిక స్ధితి ఆధారంగా సామాన్య భక్తులు, సాధారణ భక్తులు , ప్రత్యేక భక్తులు మరియు VIP భక్తులు అని విడదీసే అధికారం దేవాదాయ శాఖకు ఏ చట్టం ఇచ్చిందని ప్రశ్నించారు. ఇది దేవుని ముందు అందరూ సమానమనే ధర్మ సూత్రానికి విరుద్దమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని రావినూతల శశిధర్ అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం దేవాలయ భూములు క్రైస్తవులు ఆక్రమిస్తుంటే,దేవాలయాల భూములలో అన్యమత ప్రార్థనా స్థలాలు వెలుస్తుంటే తెలంగాణా ప్రభుత్వానికి సోయి రావడం లేదని విమర్శించారు.