తన కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ స్పందించారు. తన కుమారుడిది తప్పుడు నిర్ణయమని, తనకు చాలా బాధగా ఉందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్సిద్ధాంతాన్ని, బీజేపీ సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని ఏకే ఆంటొనీ చెప్పారు. తన జీవితకాలమంతా మతతత్వ అజెండాను వ్యతిరేకించానని చెప్పారు. తాను ఎప్పటికీ నెహ్రూ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయంగానే వుంటానితెలిపారు. తాను తన రాజకీయ చివరి దశలో ఉన్నానని, తాను ఎంతకాలం బతికి ఉంటానో తెలియదని, అయితే బతికినంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ముద్రపడిన కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మురళీధరన్ ఆయనకు కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ… అనిల్ ఆంటోనీ జనవరిలో కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు.
బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై పార్టీని దుమ్ముదులిపేశారు. కాంగ్రెస్ లో ప్రతి కార్యకర్త కుటుంబం కోసం పనిచేస్తున్నట్లు పని చేస్తారని, కానీ… తాను మాత్రం కాంగ్రెస్ కోసమే పనిచేశానని తెలిపారు. మరోవైపు ప్రపంచంలో భారత్ ను అగ్రస్థానంలో నిలపడానికి ప్రధాని మోదీ అద్భుతమైన విజన్ తో దూసుకెళ్తున్నారని, అది తనను ఆకర్షించిందని చెప్పుకొచ్చారు.
ఇక… ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ… అనిల్ ఆంటోనీ బహుముఖ ప్రజ్ఞశాలి అని కొనియాడారు. ఆయన్ను చూసినప్పుడు ఇది బాగా ఆకర్షించిందన్నారు. నరేంద్ర మోదీ డెవలప్ మెంట్ కి అనిల్ ఆంటోనీ ఆలోచనలు కూడా సమాంతరంగానే వున్నాయన్నారు. ఉత్తర భారతంలో పార్టీ విస్తరణకు అనిల్ ఆంటోనీ పనిచేస్తారని తాము నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.