తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, జాతీయవాద భావనతో మిళితం చేసి ఎన్టీఆర్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పి, విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనాన్ని చెప్పి, ప్రత్యామ్నాయ రాజకీయాల మార్గదర్శకుడిగా, ప్రజాభ్యుదయమార్గ నవ్య పథగామిగా తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. తెనాలిలో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవానికి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్టీఆర్ చారిత్రక పురుషుడని అభివర్ణించారు. రాజకీయాల్లో విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, ఆడపడుచులను రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత ఆయనదేనని ప్రకటించారు. బలహీన వర్గాలకు రాజకీయాలలో పెద్ద పీట వేశారన్నారు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి, బోళాతనంగా ఉండేవారని, అందరినీ నమ్మేవారన్నారు. అందుకే వెన్నుపోటుకు గురయ్యారని వ్యాఖ్యలు చేశారు. సిద్దాంతాలు వేరైనా పద్ధతులు పాటించే వారంటే తనకు గౌరవమని ప్రకటించారు.