వాల్తేరు వీరయ్య సినిమా అత్యద్భుతంగా వచ్చిందని… ఇందుకు దర్శకుడు బాబీయే కారణమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. జనవరి 13 న ఈ సినిమా రిలీజ్ అవబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా మాట్లాడిన చిరంజీవి.. బాస్ పార్టీ పేరిట కొత్త ఏర్పాటు ఉంటుందని చెప్పారు.. కానీ ఇలా సెట్ ఏర్పాటు చేస్తారని అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయా పాత్రలకు ఎవరైతే న్యాయం చేస్తారో బాబీ ముందే నిర్ణయించుకున్నానన్నారు.
చంద్రబోస్ అద్భుతమైన పాటలు ఇచ్చారని.. దీనికి అనుకున్నట్లుగానే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చారన్నారు. కథ చెప్పినప్పుడే బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నానని వెల్లడించారు. ఈ సినిమా గురించి ఎంత ఊహించుకున్నా.. దానికి మించే వుంటుందని, అంతకన్నా తక్కువ మాత్రం వుండదన్నారు. ఇది రొటీన్ యాక్షన్ ఎంటర్ టైనరే అయినా.. లోపల షాక్ తినేంత ఎమోషన్ దాగి వుందని తెలిపారు. ఎమోషన్ తో పాటు కామెడీ కూడా అలాగే వుంటుందన్నారు. ఇక.. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్స్ ఫైటింగ్, ప్రకాష్ ఆర్ట్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు.
ఇక… మూవీ డైరెక్టర్ బాబీ మాట్లాడాడు. ఈ సందర్భంగా తనకు చిరంజీవితో వున్న అనుబంధాన్ని వివరించారు. ఆయన్ను చూడడానికి చాలా కష్టపడ్డానని, చిన్నతనం నుంచి చిరును కలవడం కోసం ఆయన ఇంటి ముందు వెయిట్ చేసేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఎన్ని సినిమాలు చేసినా.. చిరును కలిసే ఛాన్స్ కోసం ఎదురు చూశానని, గబ్బర్ సింగ్ సెట్ లో చిరును చూసి చెమటలు పట్టాయన్నాడు. ఇక… వాల్తేరు వీరయ్య సినిమా గురించి చిరంజీవిని కలిసి వివరించానని, ఎమోషన్స్, సెంటిమెంట్లు వుండేలా చూసుకోవాలని సలహా ఇచ్చారన్నాడు. కథ కోసం అన్ని సినిమాలు చూస్తున్న తరుణంలోనే రవితేజ పాత్ర పుట్టుకొచ్చిందన్నాడు. సినిమాలో చిరంజీవి వున్నారని రవితేజకు చెప్పానని, ఠక్కున ఒప్పేసుకున్నాడని బాబీ వెల్లడించాడు.