అమెరికాలో ఎంతో మంది ప్రవాస భారతీయులు బిజినెస్ లీడర్లుగా కొనసాగుతున్నారని, అమెరికాలోని అన్ని రాష్ర్టాలతోపాటు ఇండియా స్టేట్‌ను సుసంపన్నం చేస్తున్నారని అగ్రరాజ్య సెనేటర్ టాడ్ యంగ్ కొనియాడారు. ప్రపంచ శాంతి పరిరక్షణలో అమెరికా-భారత్ మైత్రి, భాగస్వామ్యం చాలా కీలకమైనదని ఉద్ఘాటించారు. అమెరికాలోని ఇండియానా రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఈ నెల 13 నుంచి హైదరాబాద్‌లో పర్యటించారు. మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావుతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌కు చేరుకున్న టాడ్ యంగ్‌కు యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ స్వాగతం పలికారు.
అనంతరం ఆదిభట్లలోని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరో స్ట్రక్చర్స్ లిమిటెడ్‌ను సందర్శించిన టాడ్ యంగ్, అక్కడ తయారవుతున్న సీ-130జే హెరులస్ విమాన భాగాల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని టీ-హబ్‌ను సందర్శించి, అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ-హబ్ అధికారులు ఆయనను సన్మానించారు. నానక్‌రామ్‌గూడలోని అమెరికా కాన్సులేట్ కొత్త కార్యాలయాన్ని సందర్శించిన టాడ్ యంగ్, సిబ్బందితో భేటీ కావడంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులతో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇండియానా స్టేట్‌లో చదువుకొని హైదరాబాద్‌లో స్థిరపడినవారితోపాటు కెన్నడీ-లుగర్ ఫెలోషిప్ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.