అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను తిరిగి పోటీలో వుంటానని ప్రకటించారు. ప్రజా మద్దతు తనకే వుందని, బరిలోకి దిగాలనని తనను అందరూ కోరుతున్నారని అన్నారు. ఓ అంతర్జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ఇంధన సాధికార దేశంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా అమెరికా నిలదొక్కుకోవాలనేదే తన ఆశయమని, ప్రస్తుత జో బైడెన్ సర్కారు దాన్ని సమీప కాలంలోనూ సాధించే పరిస్థితి లేనే లేదని, తాను తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దీనిని సాధిస్తానని ప్రకటించారు.
ఇక.. ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన నాయకుడని ట్రంప్ ప్రశంసించారు. ఆయనతో తనకు ఇప్పటికీ సన్నిహిత సంబంధాలే వున్నాయని వెల్లడించారు. భారత ప్రధానిగా మోదీ ఎన్నో కీలకమైన బాధ్యతలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. అయితే… ఒబామా, జోబైడెన్ కంటే తనకే భారత్ తో మంచి సంబంధాలున్నాయని, తనకంటే భారత్ కు మరో మిత్రుడు లేడని గొప్పలు చెప్పుకున్నారు. ఈ విషయాన్ని మోదీని అడిగితే.. మోదీ కూడా ఇదే అంటారని ట్రంప్ పేర్కొన్నారు.