బీజేపీ ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైక్ నడుపుతూ బైక్ ర్యాలీని ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పెరెడ్ గ్రౌండ్స్ మీదుగా అసెంబ్లీ ముందున్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళల బైక్ ర్యాలీ చేపట్టారు. అమృత మహోత్సవాల్లో భాగంగా పార్టీ తరుపున వివిధ కార్యక్రమాలు బీజేపీ నిర్వహిస్తోంది. అంతుకుముందు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్న కిషన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… నిజాంను లొంగదీసుకొని, ఆనాడు సర్దార్ పటేల్ హైదరాబాద్ సంస్థానంలో జాతీయ పతాకాన్ని ఎగరేశారని గుర్తు చేశారు. 74 సంవత్సరాల తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ నగరం నడిబొడ్డున మళ్లీ జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఏడాది పొడవునా విమోచన దినోత్సవాలు కేంద్రం నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.